
జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎల్లోమీడియా చివరకు తిరుమల తిరుపతి దేవస్ధానంను కూడా వదలటంలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా చివరకు దొరక్కపోయినా సరే మరీ విషం చిమ్మేస్తోంది. దేవాలయాలపై దాడులన్నారు, విగ్రహాల ధ్వంసమన్నారు. అయితే కొన్ని ఘటనల్లో తెలుగుదేశంపార్టీ నేతల మద్దుతుదారులే ఉన్నారన్న విషయం బయటపడేటప్పటికి ఎల్లోమీడియా నోరు మళ్ళీ లేవలేదు. మళ్ళీ ఇంతకాలానికి టీటీడీకి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ అంటు గోల మొదలుపెట్టింది. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నారనే సామెత లాగ టీడీపీ నేతలు రెడీగా ఉంటారు. ఇటు ఎల్లోమీడియా విషంచిమ్మటం ఆలస్యం. వెంటనే టీడీపీ నేతలు రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డిని లేదా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు బురదచల్లేస్తారు.
మిజోరం-మయున్మార్ సరిహద్దుల్లో 120 బస్తాల్లో తలనీలాలు తీసుకెళుతున్న ఓ వాహనం పట్టుబడింది. విషయం వెలుగు చూడగానే ఇంకేముంది ఎల్లోమీడియా విషం చిమ్మేసింది. టీటీడీకి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ జరిగిందన్నది. పట్టుబడిన తలనీలాల లోడు వెనుక అధికారపార్టీ నేతల హస్తముందన్న పద్దతిలో కథనం అల్లేసింది. దాంతో సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అండ్ కో వెంటనే అందుకున్నారు. దోపిడిలో చివరకు తలనీలాలను కూడా జగన్ వదలటంలేదని రెచ్చిపోయారు. టీటీడీని వైసీపీ నేతలు ఏ విధంగా దోచుకుంటున్నారో తాజాగా బయటపడిందన్నారు. ఇంతా చేస్తే వీళ్ళ ఆరోపణలకు ఆధారాలేమిటయ్యా అంటే ఎల్లోమీడియాలో వచ్చిన కథనాలే.
ఇంతకీ అసలు విషయం ఏమిటి ? ఏమిటంటే మిజోరంలో పట్టబడిన వెంట్రుకల బస్తాలు టీటీడీదని ఎవరు చెప్పలేదు. మిజోరం పోలీసులు బుక్ చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా టీటీడీదని లేదు. సరే వాళ్ళ విషయం వదిలేస్తే తలనీలాలను ఈ టెండర్ వేలంపాటలో అమ్మిన తర్వాత వాటితో తమకు ఎలాంటి సంబంధాలు ఉండవని టీటీడీ చెప్పింది. పైగా పట్టుబడిన వాహనంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా తమ్ముళ్ళు వినటంలేదు. వాహనం ఎవరిదో ? తలవెంట్రుకల లోడు ఎవరిదో ? ఎక్కడికి తీసుకెళుతున్నారో కూడా తెలీదు. అయినా టీటీడీకి జగన్+వైసీపీకి ముడిపెట్టేసి టీడీపీ నేతలు బురదచల్లేస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళపై టీటీడీ కేసుపెట్టింది లేండి. మొత్తానికి విషం చిమ్మటమే టార్గెట్ గా పెట్టుకుంటున్నారు కాబట్టి గుడ్డిగా ఫాలో అయిపోతున్నారంతే.