వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు కస్టడీ విషయంలో సీఐడీ ఓ ముందు జాగ్రత్త తీసుకోకపోవటంతోనే సమస్య వచ్చిందా ? ఆ జాగ్రత్తేదో తీసుకునుంటే ఇపుడీ సమస్య ఉత్పన్నమయ్యేదే కాదా ? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ జాగ్రత్త ఏమిటంటే ఎంపిని కస్టడీలోకి తీసుకోగానే వైద్య పరీక్షలు చేయించటం. అవును ఎంపిని హైదరాబాద్ లోని తనింట్లో అరెస్టుచేసిన సీఐడీ అధికారులు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తీసుకొచ్చారు. తమ ఆఫీసులో కొద్దిసేపు ఎంపిని విచారించిన అధికారులు రాత్రి భోజనం పెట్టి విచారణను ఆపేశారు. మరుసటి రోజు ఉదయం హైకోర్టులో ప్రవేశపెట్టేముందు రొటీన్ వైద్య పరీక్షలు నిర్వహించారంతే. ఎంపియేమో హైకోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. సీఐడీ అధికారులు దాన్ని వ్యతిరేకించారు. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది.  ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది.




సరిగ్గా ఇక్కడే ఎంపి తన బుర్రకు పదునుపెట్టారు. సాయంత్రం గుంటూరులోని మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటీషన్ విచారణకు హాజరైనపుడు శుక్రవారం రాత్రి కస్టడీలో తనను పోలీసులు కొట్టారంటు ఆరోపణలు చేయటంతో గోల మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శనివారం ఉదయం తనను వైద్యులు పరీక్షించినపుడు పోలీసులు కొట్టారని చెప్పలేదు. తర్వాత హైకోర్టు విచారణలో కూడా పోలీసులు కొట్టినట్లు ఆరోపణలు చేయలేదు. శనివారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు భోజనం తెచ్చినపుడు కూడా తనను పోలీసులు కొట్టినట్లు వారితో చెప్పలేదు. ఎందుకంటే ఎంపి భోజనం తర్వాత కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడినపుడు కొట్టారన్న విషయాన్ని ప్రస్తావించలేదు. ఎప్పుడైతే శనివారం మధ్యాహ్నం బెయిల్ పిటీషన్ రెజెక్టయ్యిందని తెలిసిందే అప్పటి నుండే పోలీసులు తనను కొట్టారనే ఆరోపణలు చేశారు.  




ఇక్కడే సీఐడీ చేసిన పొరబాటు బయటపడింది. ఎంపిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకురాగానే వైద్య పరీక్షలు చేయించుంటే బాగుండేది. వైద్య పరీక్షలు మొత్తాన్ని వీడియో తీయించుంటే ఎంపికి ఉన్న ఎడీమా సమస్య అప్పుడే  బయటపడేది. ఎంపికి ఉన్న ఎడీమా సమస్య వల్లే కాళ్ళవాపులు, అరిపాదాల రంగు మారినట్లు గుంటూరు మెడికల్ బోర్డు నిర్ధారించింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే కొట్టారనే ఆరోపణలను ఎంపి చేయటం, దానికి స్పందనగా మెజిస్ట్రేట్ వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించిన తర్వాతే ఎడీమా సమస్య బయటపడింది. ఈ వైద్య పరీక్షలేవో కస్టడీలోకి తీసుకోగానే చేయించేసుంటే ఎంపికి ఎడీమా ఉందనే విషయం మెజిస్ట్రేట్ కు విచారణలోనే తెలిసేది. ఎలాగూ వీడియో సాక్ష్యం ఉండేది కాబట్టి ఇబ్బంది ఉండేది కాదు. ఏదేమైనా సీఐడీ చేసిన తప్పు కారణంగానే ఎంపికి బెయిల్ వచ్చినట్లు లాయర్లు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: