నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించబోతున్నారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది.

ఈ క్రమంలో హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో స్వర్ణోత్సవ కర్టెన్ రైజర్ (ముందస్తు) ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, "నాకు తొలి అవకాశం ఇచ్చింది  నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు అయితే  నన్ను ప్రోత్సహించింది  దాసరి నారాయణరావు, నన్ను సినిమా రంగంలోనికి  రమ్మని ఆహ్వానించింది శోభన్ బాబు.  నా జీవితంలో ఈ ముగ్గురినీ ఎన్నటికీ మరచిపోలేను. శోభన్ బాబుతో నేను 'ముగ్గురు మిత్రులు' అనే చిత్రం కూడా తీశాను.

క్రమశిక్షణకు ఆయన మారుపేరు. ఆయన నుంచి నాలాంటి  వారెందరో స్ఫూర్తి పొందారు. మా బ్యానర్ లో తీసిన ''అతడు' సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఆయనకు బ్లాంక్ చెక్కు ఇచ్చి నటించమని కోరాను. కానీ ఆయన అంగీకరించలేదు. అందాల నటుడిగా నాకున్న పేరును అలానే కొనసాగించాలంటే ఇతర పాత్రలు ఏవీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు అప్పట్లో నాకు చెప్పారు. అయన భౌతికంగా దూరమై 17 ఏళ్లు అయ్యింది. అంతకుముందు 13 సంవత్సరాలు పాటు ఆయన నటించలేదు. అంటే 30 ఏళ్లు గడిచినా శోభన్ బాబు ను గుర్తుపెట్టుకుని అభిమానులు మంచి మంచి కార్యక్రమములు నేటికీ చేస్తున్నారంటే...అది శోభన్ బాబు పట్ల వారికి ఉన్న ప్రేమ, గౌరవమే కారణం" అని అన్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ, "1975లో విడుదలైన 'సోగ్గాడు' చిత్రం తమ సంస్థకు మంచి పేరును, డబ్బును తెచ్చిపెట్టింది. సౌండ్ కు సంబంధించి నేటి టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నాం. మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం" అని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: