క్యాసినో కేసు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో  సంచలనం సృష్టిస్తోంది. ఇందులో పలువురు సెలబ్రెటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్యాసినో వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నేపాల్‌లో గత నెల 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు ఈ క్యాసినో వేగస్ బై బిగ్‌డాడీ పేరుతో నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంబ్లింగ్‌లో నగదు ఎలా చేతులు మారింది అనే విషయాన్ని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.


అయితే.. క్యాసినో ఆడించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పంటర్లను హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు ప్రత్యేక విమానంలో  తీసుకెళ్లినట్లు తెలిసింది. అక్కడ్నుంచి నేపాల్‌కు   రోడ్డు మార్గంలో తీసుకెళ్లారట. ఈ వ్యవహారంలో ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి ఏజెంట్లుగా ఉన్నారట. ఇలా జూదం ఆడేందుకు లక్షలు సమర్పించినట్లు ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు. కోట్లలో నగదు విదేశీ మారకంగా మార్చినట్టు అనుమానిస్తున్నారు.


అయితే.. భారత కరెన్సీని నేపాల్ రూపీల్లోకి ఎలా మార్చారు.. అలాగే  పంటర్లు గెల్చుకున్న రూపీలను తిరిగి రూపాయల్లోకి ఎలా మార్చారు అనే అంశాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. నేపాల్ ప్రభుత్వం నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రవీణ్ కు గల సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.


ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. అయితే.. గతంలోనూ డ్రగ్స్ కేసు విషయంలోనూ ఇలాగే హడావిడి జరిగింది. అనేక మంది సినీ ప్రముఖల పేర్లు వెలుగు చూశాయి. కానీ.. ఆ కేసులో ఏళ్లు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదు.. ఒక్కరినైనా అరెస్టు చేసి జైల్లో పెట్టిందీ లేదు. మరి ఈ  క్యాసినో కేసు కూడా ఇలాగే అవుతుందా.. లేక.. ఏదైనా సంచలనం జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి. చూడాలి.. ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: