రైతులకు, చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చాలాకాలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో, చంద్రబాబు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రాధాన్యం అన్నదాతలకు ఇవ్వరని ఆరోపణలు కొన్నేళ్లుగా ఉండ‌నే ఉన్నాయి. రైతుల కష్టాలు పట్టించుకోరన్న భావనను కల్పిస్తూ, వైఎస్ కుటుంబమే నిజమైన రైతు బాంధవులని చెబుతూ వైసీపీ ప్రచారం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల వద్ద నమ్మకం పెంపొందించడం టీడీపీకి ముఖ్యం కావడంతో, చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా రైతుల్లో ప‌ట్టు పెంచుకునే స‌రికొత్త‌ వ్యూహాన్ని అవలంభిస్తున్నారు. ఈ వ్యూహంలోనే “ అన్నదాత సుఖీభవ ” కార్యక్రమాన్ని సమయానికి అమలు చేస్తూ, ఇప్పటి వరకూ రెండు విడతల్లో సుమారు 70 వేల కోట్ల రూపాయలను 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. సహజ విపత్తులైన తుఫానులు, వరదల వల్ల నష్టపోయిన పంటల రైతులను కూడా ప్రత్యేకంగా ఆదుకోవడానికి ప్రభుత్వం పలు సహాయక కార్యాచరణలు ప్రారంభించింది.


రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి కష్టాన్ని తగ్గించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చ‌డ‌మే లక్ష్యంగా  ఐదు కీలక సూత్రాలతో కూడిన పంచసూత్ర ప్రణాళికను చంద్రబాబు ప్రకటించారు. ఇటీవలి కాలంలో కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో జరిగిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల సభలో చంద్రబాబు ఈ పంచసూత్రాలను వివరంగా తెలియజేశారు. వీటి అమలు ద్వారా రైతులకు నష్టాలు రాకుండా, మరిన్ని లాభాలు చేకూరే మార్గాలను ప్రభుత్వం సిద్దం చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతు దిగుబడిని మార్కెట్లో ఎవరో కొనుగోలు చేసే వరకూ ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులు తొల‌గించ‌డం కోసం రైతులే ప్రత్యక్షంగా విక్రయం చేసే విధానాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం రూపొందించిన ఈ పంచసూత్రాలు వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఒక్క కార్యక్రమాన్ని ప్రకటించడమే కాకుండా, ఆ సూత్రాలు అమల్లో ఎలా ఫలితాలివ్వాలి అన్న దానిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ లక్ష్యంతోనే ఈ నెల 24 నుంచి “ రైతన్నా… మీ కోసం ” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి సమస్యలు వినడం, అవసరాలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను వారికి చేరవేయడం చేపడతారు. వీటి ద్వారా రైతులు–ప్రభుత్వం మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ, చంద్రబాబు పట్ల రైతుల్లో సానుభూతిని, నమ్మకాన్ని పెంపొందించాలనే వ్యూహం పార్టీ రూపొందించింది. మ‌రి ఈ కొత్త ప్ర‌య‌త్నాలు, వ్యూహాలు రైతుల మనసును గెలుస్తాయా ? రైతులు - చంద్రబాబు మధ్య ఉన్న గ్యాప్ నిజంగా తగ్గుతుందా ? రాబోయే రోజుల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: