ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాల్లో కీలక పాత్ర పోషించిన‌ జనసేన పార్టీ ఇప్పటికే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి, ఆ ఓటు బ్యాంకును పూర్తిగా వైసీపీ వైపు మళ్లకుండా అడ్డుకోవాలని పార్టీ స్పష్టమైన లక్ష్యంతో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఈ వ్యూహానికి కేంద్ర బిందువుగా మారింది. పార్టీ అధినేత హోదాలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే అక్కడ సొంత ఇంటిని నిర్మించుకోవడం, తరచూ నియోజకవర్గ పర్యటనలు చేయడం, స్థానిక సమస్యలపై స్పందించడం చేస్తున్నారు.


ప‌వ‌న్ పిఠాపురాన్ని కేవలం రాజకీయ వేదికగా కాకుండా, తన శాశ్వత రాజకీయ కేంద్రంగా మార్చుకునే దిశ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో మారుమూల ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం, నీటి సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం వంటి పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించడం ద్వారా పవన్ అక్కడి ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించారు. జనసేన వ్యూహం పిఠాపురం వరకే పరిమితం కాదు. రాష్ట్రంలోని కాపు జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ పార్టీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యాసంస్థల ఏర్పాటు, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ, గ్రౌండ్ స్థాయిలో నాయకుల బలోపేతం వంటి కార్యక్రమాలను చేపట్టేందుకు పాలనలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేస్తోంది.


గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా టిడిపి - జనసేన కూటమి కలిసి వ్యూహాత్మకంగా పనిచేసినట్టుగా, ఇప్పుడు కాపు ఓటు మొత్తం కూటమి ఖాతాలో పడేలా చూడాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా వైసీపీ ఈ వర్గానికి ఆకర్షణీయమైన హామీలు ఇవ్వకపోవడం, భూముల సమస్యలు, నియామకాల్లో రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల కాపు ఓటు వైసీపీకి దూరమవుతున్న సందర్బంలో జనసేన ఆ గ్యాప్‌ను సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాపు యువతలో జనసేనకు భారీ ఆదరణ ఉంది. ఈ ఆదరణను మరింతగా పెంచుకునేందుకు పార్టీ మండల స్థాయిలో కమిటీలను బలోపేతం చేస్తోంది. కాపు నాయకుల్ని తిరిగి యాక్టివ్ చేసే దిశగా ప్రత్యేక చర్చలు కూడా జరుగుతున్నాయి.


2029 ఎన్నికల సమయానికి కాపు ఓటు బ్యాంకు ఏ దిశగా మళ్లుతుందోనే కూటమి భవిష్యత్తును నిర్ణయించే అంశంగా భావిస్తున్నారు. అందుకే జనసేన ముందుగానే అన్ని చోట్ల పట్టు బిగిస్తూ, ఈ వర్గాన్ని సమగ్రంగా తనవైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. వచ్చే నెలల్లో ఈ వ్యూహం ఎలా ఫలిస్తుంది అనేది రాజకీయంగా పెద్ద చర్చగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: