- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) :

ఏపీ రాజకీయాల్లో వైసీపీ చాలా నియోజ‌క‌వ‌ర్గాలో గ్రాఫ్ ప‌రంగా డౌన్ అవుతున్నా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో మాత్రం పార్టీకి దృఢమైన ఓటు బ్యాంక్ ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ సామాజిక వర్గాలు గతంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ వంటి ప్రజాకర్షక కార్యక్రమాలు వారిని పూర్తిగా వైసీపీ వైపుకు మళ్లించాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టుచిక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయినా బద్వేల్, అరకు వంటి బలమైన రిజర్వుడ్ నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఈ వర్గాల్లో వైసీపీకి ఉన్న మద్దతును స్పష్టంగా ఫ్రూవ్ చేసింది. అయితే ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ క్రమంగా దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ నియోజకవర్గాల నుంచే మంత్రి పదవులు పొందినవారు ... అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులలో పనిచేసిన నాయకులు కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయ్యారు.


ఆయా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు, స్థానిక వివాదాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఏ అంశంపైనా వారు చురుగ్గా కనిపించడం లేదు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా పట్టుకుని ముందుకు వెళ్లే నాయకులు కనిపించడం లేదు. స్థానిక నాయకత్వం నిర్వీర్యం కావడంతో కుల, వర్గ రాజకీయాలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఇది ఒక గుంటూరు జిల్లాకే పరిమితం అయిన సమస్య కాదు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి క‌నిపిస్తోంది.


పోలవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున మాట్లాడే ఓ నాయకుడైనా ఉండటం లేదని అక్కడి కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. రంపచోడవరం వంటి కీలకమైన గిరిజన ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకలాపాలు స్తబ్దతకు గురయ్యాయి. ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుండగా, ఆ అసంతృప్తిని తగ్గించే బాధ్యత వహించాల్సిన ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నాయకులు మాత్రం కనిపించడం లేదు. హోం మంత్రి అనిత పోటీ చేసిన కొవ్వూరు, గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది.


ఈ పరిస్థితిని గమనించిన పార్టీ సీనియర్లు, పరిశీలకులు ఒకే మాట చెబుతున్నారు. ఈ విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి భారీ న‌ష్టం త‌ప్ప‌దు. పార్టీకి ఈ వర్గాల్లో బలమైన పట్టు ఉన్నా అది సహజంగానే నిలబెట్టుకునే వాతావ‌ర‌ణం ఇప్పుడు క‌న‌ప‌డ‌డం లేదు. క్రమం తప్పకుండా ప్రజలతో మమేకం కావడం, నాయకత్వాన్ని చురుకుగా ఉంచడం, అంతర్గత విభేదాలను అదుపులో పెట్టడం కీలకం. ఇప్పుడిదంతా వైసీపీ అధిష్టానం దృష్టిలో ఉంది. నియోజకవర్గాల స్థాయిలో పరిస్థితిని పునర్వ్యవస్థీకరించడం, కొత్త నాయకులను ముందుకు తేవడం, పాత నాయకులకు బాధ్యతలు గుర్తుచేయడం వంటి చర్యలు తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. మరి పార్టీ ఈ సంకేతాలను ఎంతగా పరిగణలోకి తీసుకుంటుందో ?  లేదో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: