లక్ష్యం, దీనిపై కాస్త విశ్లేషణ అవసరం. ముందు మనిషి గురించి ఆలోచిస్తే, అతడికి ఉన్న లక్ష్యాలు ఏమైఉండొచ్చు. ఆ మనిషి కూడా వివిధ దేశాలలో ఉన్నాడు, వాళ్ళ లక్ష్యాలు కూడా వేరుగా ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా మనిషి లక్ష్యం ఒక్కటిగానే ఉండదు. దైవం ఆవిర్భవించిన భూమిగా చెపుతున్న భారతభూమిలో జన్మించిన ప్రాణులకూ, ఇతర ప్రాణులకూ తేడా లేకుండా ఎలా ఉంటుంది. అందుకే ఇతరులకు, మనకు లక్ష్యంలో చాలా తేడాలు ఉంటాయన్నది స్పష్టమైన నిజం. స్వయంగా అవతారం ఎత్తిమరీ దేవుడు ధర్మాన్ని కాపాడటానికి అవతరించిన భూమిపై నువ్వు పుట్టావు, అంటే నీ లక్ష్యం అందరికంటే విశాలదృక్పధం తో ఉండాలి మరి. అప్పుడే అందరితో నీకు కాస్త బేధం ఉంటుంది. అలా కాకుండా అందరిలాగా నువ్వు కూడా నీవు ప్రేమించేవి సాధించాలని, నీ కుటుంబం కోసం ఏవేవో సాధించాలని మాత్రమే అనుకుంటే ఇతరభూములలో పుట్టిన వారికి నీకు తేడా ఏముంటుంది, ఒక్కసారి ఆలోచించు.

నువ్వు ఇక్కడ పుట్టి, చిన్నచిన్న లక్ష్యాల కోసం కఠిన శ్రమపడుతుంటే, నువ్వు దీనికోసం కాదు నాన్న, నీకోసం మరో లక్ష్యం సిద్ధంగా ఉంది, దానిపై దృష్టి పెట్టు అని దైవం నీ దారిని మళ్లిస్తారు. దానిని గమనించకుండా, నేను పలానా సాదించలేకపోయాను అంటూ ఆత్మత్యాగానికి పాల్పడటం ఎంతవరకు సబబు, ఆలోచించు. అందుకే లక్ష్యం దారి మళ్లొచ్చు, అది మరింతగా విశాల దృక్పధం వైపు వెళ్లాలని దైవం భవిస్తూ ఉండొచ్చు, దానిని కూడా ఒక్కసారి గమనించు. నీకు స్వతహాగా ఒక క్రీడాకారుడిగా కావాలని ఉండొచ్చు, దానికోసం నువ్వు నిరంతరం పరిశ్రమ పడుతూ ఉండొచ్చు; నీకు అప్పగించిన లక్ష్యం జాతీయంగానో, ప్రపంచ స్థాయిలోనే ఉంది కావచ్చు. అలాంటి సామర్థ్యం ఉన్న నీవు, చిన్న చిన్న లక్ష్యాల కోసం కఠిన శ్రమ పడుతూ, సమయాన్ని వృధా చేస్తున్నావేమో చూసుకో.  

ఆత్మత్యాగం కూడా అంత సులభం కాకపోవచ్చు, అది కూడా సులభం అయితే క్షణానికి కోటి మంది దానినే ఎంచుకుంటారు. ఎందుకంటే ప్రతివారి మనసు ఏదో ఒకక్షణం  బాధకు గురి కాకుండా ఉండి ఉండదు. దానితో ఈ భూమిపై ప్రాణి అంతరించిపోవడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. అందుకేనా ఇంత సృష్టి జరిగింది. నీకు అనంత శక్తి ఉంది, దానిని విశాల లక్ష్యాలు సాధించడానికి మళ్లించాలని నీకు సంకేతాలే, నీ అపజయాలు. వాటిని దాటలేకపోవడం కాదు సమస్య, విశాలంగా ఆలోచించమని ఆ ఆటంకాలు నీకు చెపుతున్నాయని తెలుసుకో. దేశం నుండి థెరిసాలు ఎందరో రావాల్సింది, కానీ ఎక్కడి నుండో థెరిసా భారత్ కు వచ్చి సేవలు అందించాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగి ఉండొచ్చు అని ఆలోచిస్తే, ఇక్కడ పుట్టిన వారు ఎంత కుంచిత లక్ష్యాల కోసం పరుగులు తీస్తున్నారు అనేది చూపించడానికి అని అర్ధం అవుతుంది. థెరిసా, దైవం పంపిన మొట్టికాయగా చెప్పవచ్చు. అసలు ఇక్కడ నుండి ప్రపంచానికి సేవ చేసేవారు బయలుదేరాలి కానీ, ఎక్కడి నుండో మరొకరు వచ్చి ఇక్కడ సేవలు అందించాల్సి వచ్చిందంటే, అప్పటికే మనం ఎంత కుంచిత లక్ష్యాల వెంట పరుగులు పెడుతున్నామో మరి. ఇప్పటికి అలాగే ఉన్నామేమో పరికించి చుసుకోవాల్సిందే. అప్పుడే ఆయా లక్ష్యాలు సాదించలేకపోయాము అనే కారణంగా ఆత్మత్యాగాలు చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. లక్ష్యం నీది కాదు, నీ కోసం కాకూడదు అప్పుడే అది లక్ష్యం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: