
ఉల్లికాడలు లేదా స్ప్రింగ్ ఆనియన్స్ కేవలం వంటకాలకు రుచిని, అలంకరణను ఇవ్వడానికే కాదు, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉల్లికాడల్లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఏ, విటమిన్ బి2తో పాటు ఫోలేట్, క్రోమియం, మాంగనీస్, కాపర్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
ఉల్లికాడల్లో ఉండే కెమోఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి, రక్త ప్రవాహాన్ని సజావుగా ఉంచుతుంది. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు రక్తపోటు (బీపీ)ను నియంత్రణలో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫోలేట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఉల్లికాడల్లో ఉండే క్రోమియం రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం చాలా మంచిది. విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఉల్లికాడలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వీటిలోని యాంటీ-బాక్టీరియల్ మరియు యాంటీ-వైరల్ లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి.
ఉల్లికాడల్లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వీటిలో విటమిన్ కె మరియు కాల్షియం ఉండటం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా ఇవి రక్షణ కల్పిస్తాయి. ఉల్లికాడల్లో విటమిన్ ఏ మరియు కెరోటినాయిడ్లు ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, కంటి చూపు సమస్యలు రాకుండా కాపాడతాయి. ఉల్లికాడలు తినడం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయని చెప్పవచ్చు.