
ధన త్రయోదశి పండుగ దీపావళి వేడుకలకు నాంది. ఈ పవిత్రమైన రోజు లక్ష్మీ దేవి, ధన్వంతరి, కుబేరుడిని పూజిస్తారు. ఇంట్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నిలయంగా ఉండాలని హిందువులు నమ్ముతారు. అందుకే ఈ రోజున కొన్ని శుభ కార్యాలు చేస్తే ఎంత మంచిదో, కొన్ని పనులను అస్సలు చేయకూడదు. వాటిని గురించి తెలుసుకుందాం. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం, ముఖ్యంగా చిమ్మడం వంటివి చేయకూడదు. అలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్ముతారు. ప్రధానంగా ఇంటి గుమ్మం ఎదురుగా రాత్రిపూట తుడవకూడదు.
ధన త్రయోదశి రోజున ఇతరులకు డబ్బును దానం చేయడం లేదా ఎరువుగా (అప్పుగా) ఇవ్వడం మంచిది కాదు. ఈ రోజు సంపదను ఇంట్లోకి ఆహ్వానించే రోజుగా భావిస్తారు, బయటకు పంపకూడదు. డబ్బును దానం చేయాలనుకుంటే, ఒక రోజు ముందు లేదా తర్వాత చేయడం మంచిది.
సాయంత్రం చీకటి పడిన తర్వాత ఉప్పు, పెరుగు, పుల్లటి ఆహార పదార్థాలను ఇతరులకు ఇవ్వకూడదు. ముఖ్యంగా ధన త్రయోదశి నాడు ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. దీని వలన ఇంట్లో అశుభ ఫలితాలు, టెన్షన్లు పెరుగుతాయని నమ్మకం. నలుపు రంగు అశుభంగా భావించబడుతుంది. కాబట్టి ధన త్రయోదశి రోజున నల్లని బట్టలు, వస్తువులు కొనడం లేదా ఇతరులకు బహుమతిగా ఇవ్వడం చేయకూడదు. ప్రకాశవంతమైన రంగులైన ఎరుపు, పసుపు, బంగారం వంటి వాటిని ఎంచుకోవడం మంచిది.
కత్తులు, కత్తెరలు, ఫోర్కులు వంటి పదునైన వస్తువులను ఈ శుభ దినాన కొనడం మంచిది కాదు. ఇవి సంపద ప్రవాహాన్ని అడ్డుకుంటాయని నమ్ముతారు. ధన త్రయోదశి రోజున ఇంటిని చీకటిగా ఉంచకూడదు. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి దీపాలు, లైట్లతో ఇంటిని పూర్తిగా ప్రకాశవంతంగా అలంకరించాలి. ఈ పండుగ రోజున సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ప్రతికూల కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, ఇతరులతో గొడవపడటం, మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి పనులను అస్సలు చేయకూడదు.
ఈ నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం లభించి, ఇంట్లో సంపద, శ్రేయస్సు కలుగుతుందని ప్రజల విశ్వాసం.