2019 ఎన్నికల్లో జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా, రాపాక మాత్రం గెలుపు గుర్రం ఎక్కారు. తూర్పుగోదావరి రాజోలు నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై విజయం సాధించారు. అయితే అధ్యక్షుడు ఓడిపోతే ఓడిపోయారు...ఒక ఎమ్మెల్యే అయినా మన పార్టీకు ఉన్నారనే ఆనందం జనసైనికులకు రాపాక లేకుండా చేసారు. 

 

గెలిచిన కొన్ని రోజులు బాగానే పార్టీలో తిరిగిన రాపాక, తర్వాత నుంచి సీఎం జగన్ భజన చేయడం మొదలుపెట్టారు. ఆయన ఏ పథకం పెట్టిన, అటు అసెంబ్లీలో, ఇటు బయట పొగడటమే పనిగా పెట్టుకున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పిలుపుకు రాపాక ఏ మాత్రం స్పందించడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో గానీ, మీటింగ్ ల్లో గానీ పాల్గొనడం లేదు. కానీ వైసీపీ చేసే కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. దీని బట్టి రాపాక, వైసీపీ మద్దతుదారుడు అయిపోయారని జనసైనికులు ఫిక్స్ అయిపోయారు. 

 

ఇక ఎమ్మెల్యేగా రాపాక పనితీరు పెద్దగా బాగోలేదని తెలుస్తోంది. సొంత పనులు చేసుకోవడంలో మాత్రం రాపాక ముందున్నారని అర్ధమవుతుంది. అలాగే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి.  అయితే జగన్…ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుని తప్పించి, దొమ్మలపాటి అమ్మాజీని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించారు. అమ్మాజీ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. కానీ టీడీపీ కేడర్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. 

 

అయితే ఏదైనా కాంట్రాక్ట్ పనులు ఉంటే అమ్మాజీ, రాపాక వర్గాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ చింతా అనురాధ వర్గం కూడా ఈ నియోజకవర్గంలో బాగానే పెత్తనం చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ టికెట్లని నలుగురు నేతలు పంచుకున్నారు. రాపాక, బొంతు, చింతా, అమ్మాజీలు తమ తమ వర్గాలకు టికెట్లు ఇచ్చుకున్నారు. 

 

ట్విస్ట్ ఏంటంటే రాపాక  వైసీపీ బీఫామ్స్ పంచడం హైలైట్. ఇలా రాపాక పూర్తిగా వైసీపీ నేతగా మారిపోవడంతో కాపులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. వారు పూర్తిగా రాపాకకు దూరమైపోయారు. నియోజకవర్గంలో న్యూట్రల్ ఓటర్లు కూడా రాపాక పనితీరు పట్ల సంతృప్తిగా లేరు. ఒకవేళ రాపాక వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గెలవడం కష్టం అంటున్నారు. మొత్తానికైతే ఎమ్మెల్యేగా ఉన్న రాపాక, జగన్ కు భజన చేయడంలో ముందున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: