తెలుగు సినిమాకు సంక్రాంతి వంటి మరో బ్రహ్మాండమైన సీజన్ లేదు. ఈ సీజన్ లో ఏ సినిమాలు వస్తాయా అని అభిమానులంతా ఎదురు చూస్తుంటారు. పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి కలసి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో ప్రధానంగా నాలుగు పెద్ద హీరోల సినిమాలు బరిలో నిలిచాయి. వాటిలో అన్నింటికంటే ముందుగా రజినీకాంత్ దర్బార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

దర్బార్ సినిమా ఇటీవలి కాలంలో వచ్చిన రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఫర్వాలేదనిపించింది. అయితే అది ఫర్వాలేదు వరకూ మాత్రమే. అంతకు మించి లేదు. డైరెక్టర్ మురుగదాస్ అనగానే ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ మురగదాస్ కూడా మిగిలిన దర్శకుల్లాగానే రజినీకాంత్ మేనియా క్యాష్ చేసుకోవడమే ప్రధానం అనుకున్నాడు తప్ప.. తన సొంత మార్కు చూపించలేకపోయాడు. అందుకే దర్బార్ సినిమా హాఫ్ మీల్స్ అని చెప్పొచ్చు.

 

ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా.. దర్బార్ కంటే బెటర్ అనిపించింది. తొలిసారిగా పెద్ద హీరోను డీల్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి క‌మ‌ర్షియ‌ల్‌గా సేఫ్‌ గేమ్ ఆడేందుకు ట్రై చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో క‌మ‌ర్షియాలిటీ మ‌రీ ఎక్కువై క‌మర్షియ‌ల్ మాసాలా దినుసులు ఎక్కువుగా వాడేశాడు. దీంతో రొటీన్, నాటుకొట్టుడు ఎక్కువైంది. ఒక్క కామెడీ మాత్రమే కాదు. యాక్షన్, డైలాగ్స్, సీన్స్ అన్నీ మోతాదు మించి సినిమా ఘాటెక్కింది. అందుకే ఇది ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు.

 

ఇక చివరగా వచ్చిన అల వైకుంఠపురములో మాత్రం.. సంక్రాంతి ప్రేక్షకుడికి బిర్యానీ అనే చెప్పొచ్చు. క్లాసు, మాసు.. అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తోంది. త్రివిక్రమ్ తన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. దర్శకుడిగా త్రివిక్రమ్ విశ్వరూపం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ ఫామన్స్, తన్మయపరిచే థమన్ మ్యూజిక్, సినిమాను కాన్వాసులా తీర్చిదిద్దిన.. స్టైలిష్ టేకింగ్ ఇలా ఒకటేమిటి.. అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రతిభతో ఈ సినిమా సంక్రాంతి ప్రేక్షకులకు బిర్యానీయే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: