కొన్ని సినిమాలు డబ్బు తీసుకొస్తాయి. మరికొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే తీసినోళ్లకు.. నటించినోళ్లకు.. చూసినోళ్లకు కూడా సంతృప్తినిస్తాయి. అలాంటి సినిమానే మా భూమి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరట నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ చరిత్ర సృష్టించింది. ఈ చరిత్ర నేటితో 40ఏళ్లు పూర్తి చేసుకుంది. 

 

మా భూమి సినిమా గురించి చెప్పుకోవడం అంటే.. ఓ విప్లవం గురించి చర్చించుకోవడమే. బానిసత్వంలో నుంచి పుట్టిన పోరాటాన్ని, ఆ చైతన్యాన్ని స్మరించుకోవడమే. నిజాం కాలంలో రజాకార్లు చేసిన ధమనకాండలు, ఆ అఘాయిత్యాల నుంచి లేసిన పిడికిళ్లు, దొరల గడీలను దున్నిన నాగళ్ల కథలను మా భూమిగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్ ఘోష్. 

 

గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో నర్సింగరావు, రవీంద్రనాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో సాయిచంద్ ఉద్యమనాయకుడు రామయ్య పాత్ర పోషించాడు. ఉర్దూ రచయిత కిషన్ చందర్ రాసిన జబ్ ఖేత్ జగే నవల ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. జబ్ ఖేత్ జాగే అంటే పొలాలు మేల్కొన్నప్పుడు అని అర్థం. రైతులు, కూలీలు కలిసి చేసిిన పోరాటంగా రూపొందిన ఈ చిత్రం 1980 మార్చి 23న విడుదలైంది. నాటి పరిస్థితుల ప్రభావంతో బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం నమోదు చేసుకుంది. 

 

మా భూమి సినిమా ప్రేక్షకులకు చేరువవడానికి కథా నేపథ్యం ఓ కారణమైతే.. వింజమూరి సీతాదేవి అందించిన సంగీతం మరో కారణం. వామపక్ష ప్రభావమున్న ఆ రోజుల్లో వచ్చిన ఈపాటలకు థియేటర్లలో విపరీతమైన స్పందన వచ్చేది. సుద్దాల హనుమంతు రాసిన పశులకాసే పిలగాడ, ప్రజాకవి యాదగిరి రచనలో గద్దర్ పాడిన బండెనక బండికట్టి పాటలు ప్రేక్షకులను కుదురుగా కూర్చోనివ్వలేదు. ఇక మాటలు, పాటలు కథా నేపథ్యం అంతా సహజంగా కనిపించే ఈ చిత్రమే బ్లాక్ అండ్ వైట్ లో చివరి చిత్రమని చెబుతాడు మా భూమి నాయకుడు సాయిచంద్. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: