దేశం కరోనా సంక్షోభంతో అల్లాడిపోతోంది. బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ అందక మన వాళ్ళని కళ్లముందే కోల్పోతున్నాం. కాపాడండి అని మన వాళ్ళు అడిగే చివరి మాట విని ఏమి చేయలేని పరిస్థితులలో కృంగిపోతున్నాం. ఇలాంటి సమయంలో మరో వైపు రాజకీయనాయకులు, కొందరు ప్రైవేటు హాస్పిటల్ ల వ్యవహారశైలిపై మండిపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఇందుకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో లో తన భాదను, ఆవేదనను వ్యక్తం చేశారు ఆర్పీ. ఆ వీడియోలో ఏమన్నారంటే .. అందరికీ నమస్కారం , నేను మీ ఆర్పీ పట్నాయక్. ఎంతో ఆవేదనతో కృంగి పోతున్నాను. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ మన దేశంలో అంతకంతకూ పెరుగుతుంది. ఒకప్పుడు వుహాన్ ని ప్రపంచమంతా ఎలా వెలివేసినట్టు చూసిందో, ఇప్పుడు మన దేశాన్ని కూడా అలానే చూస్తోంది.

మీతో నా ఆవేదన పంచుకోవడం ముఖ్యం అనిపించింది. అందుకే ఈ వీడియో. మా అమ్మకి బెడ్ దొరకలేదని బాధపడిన కొందరు వారి ఆగ్రహాన్ని హాస్పిటల్ సిబ్బందిపై చూపారు. కానీ బెడ్స్ లేనప్పుడు వారు మాత్రం ఏం చేస్తారు. అమ్మ ఎవరికైనా అమ్మే .. అలాంటి అమ్మ ప్రాణం మీదకు వచ్చి కళ్లముందే విగతజీవిగా మారిపోతే, కోపం రావడంలో అర్థం ఉంది. కానీ అలా హాస్పిటల్ సిబ్బందిపై దాడి చేస్తే వారి ద్వారా  చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సంఘటనలు చాలానే చూస్తున్నాం. ఇక్కడ తప్పెవరిది అంటే ఎవరినీ నిందించలేని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. అదే విధంగా మనకు కనబడుతున్న కరోనా కేసులు మరణాల లెక్కల్లో వాస్తవం లేదు. అసలైన కరోనా మరణాల సంఖ్య స్మశానంలో దర్శనమిస్తూ గుండెల్ని పిండేస్తుంది. ఇంతటి విపత్కర సమయంలో కొందరు రాజకీయనాయకులు వారి స్వార్దం వారు చూసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

ఎన్నికలు, ప్రచారాలు, ఫలితాలు అంటూ వ్యవహరించిన తీరు నిజంగా తలదించుకోవాల్సిన సందర్భం. ఎందుకయ్యా ఇలాంటివారు మనకు, శవాలమీద మీరు ఆడిన ఆట మీకు అంతలబ్దిని చేకూర్చిందా.. అసలు మీరు మనుషులేనా మీలో మానవత్వం కొంతయినా ఉందా..ఎన్నికల మీద చూపిన మీ శ్రద్దలో ఒక వంతైనా మిమ్మల్ని నాయకులని జేజేలు పలుకుతున్న ఈ అమాయక ప్రజలపై పెట్టండి. వారి ప్రాణాలకు విలువ ఇవ్వండి. అంటూ ఆర్పీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇకనైనా మారండి ప్రజల ప్రాణాలను రక్షించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో చూసిన ప్రజలు కంటతడి పెడుతున్నారు. అలాగే ఆక్సిజన్ అందని సమయంలో ప్రానింగ్ పద్దతిలో పడుకోవాలని ఇది చాలా కీలకమైన అంశం అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: