
"ఆయన జీవితంలో ముగ్గురు పద్మలున్నారు. ప్రేమించిన పద్మ సగోత్రం కారణంగా మా మావగారు అభ్యంతరం చెప్పడం వల్ల దూరమైంది. పెళ్లాడిన పద్మను నేను. నేను కూడా కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం ఆయనకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. మూడో పద్మ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం వల్ల అసుపత్రిలో చేరినప్పుడు ఆయనకు సేవ చేసిన నర్సు. వృత్తి ధర్మమైన విధి నిర్వహణగా కాక, వ్యక్తిగతంగా తనను అభిమానించి, సేవ చేసి బతికించిందని ఆత్రేయ ఆమెను చాలా మెచ్చుకొనేవారు. ఆ తర్వాత ఆమెకు కంచి బదిలీ అయితే, అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి చూసి వస్తుండేవారు. ఆ పద్మ అకాల మరణానికి ఆయన ఎంతో బాధపడ్డారు." అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆత్రేయ సతీమణి పద్మ.
1940లో ఆత్రేయతో పద్మావతికి వివాహం జరిగింది. వారిది దగ్గరి బంధుత్వమే. అయితే 1954లో ఆయన సతీమణి పద్మను మద్రాసు తీసుకెళ్లి కాపురం పెట్టారు. ఆళ్వారుపేటలోని చిన్న ఇంట్లో ఉండేవారు. ఆయన రోజూ ఇంటికొచ్చేవారు కాదని, ఇంటి యజమానులకు సకాలంలో బాడుగ కూడా చెల్లించేవారు కాదని చెబుతారు పద్మావతి. 1956లో ఆత్రేయ అత్తమ్మకు కాళ్లు చచ్చుపడిన కారణంగా, ఆయన సతీమణి పద్మావతి మంగళంపాడుకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత భార్యా భర్తలిద్దరూ కలసి ఉన్న సందర్భాలు తక్కువే.
వివాహ బంధం సరిగా సాగకపోవడంతో.. నల్ల కమల అనే మహిళను ఆత్రేయ చేరదీశారని చెబుతారు. కమల సంతానమే అసలు ఆత్రేయ కూతుళ్లుగా చెలామణి అయ్యారట. ఆమె 1978లో చనిపోగా.. ఆ తర్వాత ఆ కుటుంబ భారాన్నంతా ఆత్రేయే మోశారట. ఆయన సంపాదన అంతా వారికే ఖర్చు చేసేవారని, సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ వారికోసమే త్యాగం చేశారని అంటారు.