
టాలీవుడ్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ చేసి ఫేమస్ అయిన సోనూసూద్ ఇప్పుడు రియల్ హీరోగా భారత ప్రజల అందరి చేత మన్ననలు పొందుతున్నారు.. ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని కొన్ని పనులను ఆయన క్షణాల్లో చేసి చూపెడుతున్నారు.. ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ అందక, ఆసుపత్రిలో చాలా మంది మృత్యు వాత పడుతున్నారు. ఈ క్రమంలోనే సోనూసూద్ చేస్తున్న సేవలు ఒక్కటి అని చెప్పలేము. సేవ చేయాలంటే కావాల్సింది చేయాలనే శ్రద్ధ అని నిరూపిస్తున్న సోనూసూద్ తాజాగా ఒక మహిళను ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది.
ఆ మహిళ మరెవరో కాదు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక యూట్యూబర్. స్వతహాగా అంధురాలైన నాగ కవిత అనే సదరు మహిళ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆమెకు ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయల దివ్యాంగుల పెన్షన్ లభిస్తోంది. తాజాగా ఆమె ఐదు నెలల పెన్షన్ 15 వేల రూపాయలు సోనూసూద్ ఫౌండేషన్ కి విరాళంగా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
'' ఆంధ్రప్రదేశ్ లోని వరికుంటపాడు అనే ఒక చిన్న గ్రామానికి చెందిన బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్కు 15 వేల రూపాయలు విరాళంగా అందించింది, ఆ డబ్బు ఆమెకు ఐదు నెలల పెన్షన్'' అని సోనూ సూద్ పేర్కొన్నారు. నా వరకు ఆమె భారతదేశంలోని సంపన్నమైన మహిళ అని సోను సూద్ ట్వీట్ చేశారు. ఒకరి బాధను అర్థం చేసుకోవాలంటే చూడనవసరం లేదని ఆమె సందేశం ఇచ్చిందని ఆమె నిజమైన హీరో అని సోనూ పేర్కొన్నాడు.