పాత సినిమాలలో అలనాటి పాటలను ఇప్పటికీ జనం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సాలూరి రాజేశ్వరరావు కే.వి. మహదేవన్ ఎమ్ ఎస్ విశ్వనాథన్ పెండ్యాల లాంటి ఎందరో సంగీత దర్శకులు అలనాటి సినిమా పాటలకు ఒరిజనల్ ట్యూన్స్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కాలం మారిపోయి ఎంత బాగా కాపీ కొడితే అంత ఎక్కువగా కోట్లల్లో సంగీత దర్శకులకు నిర్మాతలు పారితోషికాలు ఇస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా లేటెస్ట్ గా విడుదలైన ‘వాల్టేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ పాటలు అంటు విమర్శకులు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన ‘పుష్ప’ మూవీలో ‘ఊ అంటావా మామా’ పాట దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడ నుంచి అనుసరించాడో ఉదాహారణలతో సహా అప్పట్లో సోషల్ మీడియాలో వివరించారు. ఇప్పుడు ఇక లేటెస్ట్ గా ‘వాల్టేర్ వీరయ్య’ మూవీలోని ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ సాంగ్ ట్యూన్ కూడ కాపీ అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరిగింది.  


ఇక నిన్న విడుదలైన ‘వీరసింహా రెడ్డి’ మూవీలోని ‘జై బాలయ్య’ పాట ట్యూన్ ను ఏకంగా వందేమాతరం శ్రీనివాస్ ‘ఒసే రావులమ్మ’ ట్యూన్ ను మక్కీమక్కీగా తమన్ కాపీ కొట్టాడు అంటూ మళ్ళీ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను చూసి చాలామంది షాక్ అవుతున్నారు. వాస్తవానికి దేవీశ్రీ ప్రసాద్ తమన్ లకు సంగీత దర్శకులుగా మంచి పేరుంది. ఈమధ్యనే జాతీయ స్థాయిలో తమన్ కు అవార్డులు కూడ వచ్చాయి.


అలాంటి నేపద్యం ఉన్న వీరిద్దరి పై ఇప్పుడు కాపీ కామెంట్స్ వస్తూ ఉండటంతో వీరు తాము చేసే పాటల పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారా లేదంటే ఎలాంటి ట్యూన్ ఇచ్చినా తమకు రావలసిన కోట్లు నిర్మాతలు ఇస్తారు కదా అన్న ధైర్యమా అన్న విషయం వారికే తెలియాలి. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఇంకా చాల పాటలు విడుదల కావలసిన పరిస్థితులలో ఈ కాపీ రగడ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి..





మరింత సమాచారం తెలుసుకోండి: