తెలుగు సినీ చరిత్రలో నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లెక్కించుకున్నారు డాక్టర్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య. నటుడిగా, కమీడియన్ గా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. అయితే తాజాగా అల్లు రామలింగయ్య గారి 101 వ జయంతిని పురస్కరించుకుని నిర్మాతలు అల్లుఅరవింద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది.అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ అల్లు రామలింగయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ లో ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగడం విశేషం. దానికి తోడు మనవడు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కూతురు అర్హతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఆయన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. గత ఏడాది అల్లు రామలింగయ్య శతజయంతిని పురస్కరించుకుని అల్లు స్టూడియోని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు అల్లు బిజినెస్ పార్క్ లో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేయడం విశేషం. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ మాట్లాడుతూ.." అల్లు రామలింగయ్య తాత గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా, ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. 

తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి" అని అన్నాడు. సుమారు 1000 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య తన సినీ జీవితంలో మూడు తరాల ప్రేక్షకులను అలరించారు. తనదైన నటనతో 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్విస్తూ యావత్ సినీ ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని కల్పించుకున్నారు. అయితే అంతా బానే ఉన్నా ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మిస్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం గమనార్హం. అందుకు కారణం బన్నీ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉండడమే అని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: