
తెలుగు సినిమా నిర్మాత స్రవంతి రవి కిషోర్ కు మేనల్లుడు అయిన రామ్.. 2002లో వచ్చిన `అడయాళం` ద్వారా 12 ఏళ్లకే యాక్టింగ్ ప్రారంభించాడు. ఇదొక తమిళ షార్ట్ ఫిల్మ్. ఈ లఘు చిత్రంలోని రామ్ నటనకు గాను స్విట్జర్లాండ్‌లోని యూరోప్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా వచ్చింది. 2006లో `దేవదాసు` సినిమాతో ప్రముఖ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రామ్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఇదే సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్ గా మారింది. రొమాంటివ్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన దేవదాసు సూపర్ హిట్ కావడమే కాకుండా థియేటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడింది. డెబ్యూ హీరోగా రామ్ కు దక్కిన అరుదైన గౌరవం ఇది.
ఆ తర్వాత `జగడం`, `రెడీ`, `మస్కా`, `గణేష్`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. హై ఎనర్జీ డాన్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఒక దశ వరకు కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీలకే ప్రధాన్యత ఇచ్చిన రామ్.. `ఇస్మార్ట్ శంకర్`తో మాస్ హీరోగా అవతరించాడు. ఈ సినిమా ద్వారా తనలో ఉన్న మరో నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అలాగే కెరీర్ లో హిట్ వచ్చినప్పుడు పొంగిపోయి, ఫ్లాప్ వచ్చినప్పుడు డీలా పడే వ్యక్తి రామ్ కాదు. సక్సెస్, ఫెయిల్యూర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రామ్ ముందుకు సాగుతున్నాడు.
ఇకపోతే రామ్ కు హిందీలోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధింస్తుంటాయి. రామ్ హీరోగా నటించిన `ఇస్మార్ట్ శంకర్` హిందీ డబ్ వెర్షన్ యూట్యూబ్‌లో 200 మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించింది. ఈ మూవీతో 2 బిలియన్ల వ్యూస్ సాధించిన తొలి సౌత్ హీరోగా రామ్ రికార్డు కూడా సృష్టించాడు. అన్నట్లు ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు. ఆయన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో `ఆంద్ర కింగ్ తాలూకా` అనే మూవీ చేస్తున్నాడు రామ్. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేం పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం 2025 ఎండింగ్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.