ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చాలా గ్యాప్ అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో `భైరవం` అనే సినిమా చేశాడు. విజయ్ కనకమేడల డైరెక్టర్ చేసిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్న బెల్లంకొండ శ్రీనివాస్.. తాజాగా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించి వార్తల్లో నిలిచాడు.


జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో కుటుంబంతో క‌లిసి బెల్లంకొండ శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు. అయితే ఈనెల 13న జర్నలిస్టు కాలనీలోని చౌరస్తా వద్ద రాంగ్ రూట్ తీసుకుని తన ఇంటికి వెళ్లేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బెల్లంకొండను అడ్డుకుని.. రాంగ్ రూట్‌లో వెళ్లొద్దంటూ హెచ్చరించారు. అయితే కానిస్టేబుల్ మాటలు లెక్క చేయని బెల్లంకొండ.. రాంగ్ రూట్లోనే ముందుకు వెళ్ల‌బోయాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్, బెల్లంకొండ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


రాంగ్ రూట్ అంటూ కానిస్టేబుల్ వారిస్తుండగా.. బెల్లంకొండ శ్రీనివాస్ కారును అతని పైకి పోనిచ్చి దురుసుగా ప్రవర్తించాడు. ఇక ఈ వ్యవహారం మొత్తాన్ని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో బెల్లంకొండ శ్రీనివాస్ పై విమర్శలు వెల్లువెత్తాయి. హీరోలు అయితేనేం.. రూల్స్ పాటించరా? అంటూ నెటిజ‌న్లు ఆయ‌న్ను గ‌ట్టిగా ట్రోల్ చేశారు.


ఇక మరోవైపు ఇదే విషయాన్ని సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్ లో కారు నడపడంతో పాటు అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన కారణంగా కేసు నమోదయింది. మరి ఈ విషయంపై బెల్లంకొండ శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: