సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార సినిమా ప్రమోషన్స్ కు రాదన్న విస‌యం అందరికీ తెలిసిందే. డేట్స్ ఇచ్చామా.. సెట్ కు వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నామా అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్ విషయంలో ఆమె రాజీ పడిందే లేదు. అందులోనూ తెలుగు సినిమా ప్రమోషన్స్ కు నయన్ అస్సలు రాదు. గ‌తంలో `సైరా న‌ర‌సింహరెడ్డి` ప్ర‌మోష‌న్స్ కు ర‌మ్మ‌ని రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా పిలిచినా మొహ‌మాటం లేకుండా నో చెప్పేసింది.


అటువంటి నయనతారతో ప్ర‌మోష‌న్స్ విష‌యంలో రూల్ బ్రేక్ చేయించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్ లో అప‌జ‌యం ఎరుగుని అతికొద్ది మంది దర్శ‌కుల్లో అనిల్ రావిపూడి ఒక‌రు. ఈయ‌న సినిమాల విజ‌యంలో కంటెంట్ తో పాటు ప్ర‌మోషన్స్ కూడా కీల‌క పాత్ర‌ను పోషిస్తుంటాయి. సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో అనిల్ రావిపూడి స్టైలే వేరు. ఇక‌పోతే ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడికి ఓ మూవీ క‌న్ఫార్మ్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. `మెగా 157` వర్కింగ్ టైటిల్ తో వీరి కాంబో చిత్రం అనౌన్స్ చేయ‌బ‌డింది.



ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న నయనతార హీరోయిన్ గా నటించబోతుందని గత కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారాన్నే నిజం చేస్తూ మెగా 157 లో నయనతార హీరోయిన్‌గా యాక్ట్ చేయ‌బోతుంద‌ని చిత్ర‌బృందం అధికారంగా ప్ర‌క‌టించింది. మెగా 157 ప్రాజెక్ట్ లోకి నయనతార ఎంట్రీ ఇచ్చింద‌నే విషయాన్ని తెలుపుతూ ఓ వీడియో కూడా వదిలారు. అయితే ఈ వెల్క‌మ్ వీడియోలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన స్ట్రాటజీని ప్లే చేసి న‌య‌న్ చేత ప్ర‌మోష‌న్స్ చేయించాడు.

 

వీడియోను గ‌మ‌నిస్తే.. మేకప్ రూంలో మేకప్ చేసుకుంటూ గ‌ల‌గ‌లా తెలుగులో మాట్లాడుతుంది న‌య‌న్‌. అది గ‌మ‌నించిన‌ అసిస్టెంట్ `తెలుగులో మాట్లాడుతున్నారు.. తెలుగు సినిమా చేస్తున్నందుకా?` అని ప్రశ్నిండంతో.. అందుకు న‌వ్వుతూ అవునంటుంది. నెక్స్ట్  కారులో మెగాస్టార్ పాట ప్లే అవుతుండగా.. `అన్నా.. చిరంజీవి గారి పాట.. సౌండ్ కొంచె పెంచు` అని నయన‌తార అన‌డంలో.. వెంట‌నే డ్రైవ‌ర్ `మేడమ్ చిరంజీవి గారితో చేస్తున్నారా?` అని అడుగుతాడు. మ‌రొక సీన్‌లో స్క్రిప్ట్ అంతా చదివి నవ్వుకుంటూ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌గా ఉందే అని న‌య‌న్ అన‌డంలో.. `అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో చేస్తున్నారా?` అని మ‌రొక వ్య‌క్తి అడుగుతాడు.



ఇక ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చి మెగాస్టార్ స్టైల్‌లో.. `హలో మాస్టారు.. కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా.` అని న‌య‌న్‌ డైలాగ్ చెప్పగానే.. అనిల్ రావిపూడి ఎంట‌ర్ అవుతాడు. ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి చిరు స్టైల్‌లో `సంక్రాంతికి రఫ్పాడించేద్దాం` అంటూ చెప్పడం హైలెట్‌గా నిలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ప్రమోషన్స్ అంటే ఆమడ దూరంలో ఉండే నయనతార చేతే ప్రమోషన్స్ చేయించాడు అనిల్ రావిపూడి. అది కూడా సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే. దీంతో `నువ్వు మామూలోడివి కాద‌య్య అనిల్ రావిపూడి` అంటూ నెటిజ‌న్లు జోకులు పేలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: