
ఈ ఏడాది జనవరిలో ఎస్‌ఎస్‌ఎంబీ29 సెట్స్ మీదకు వెళ్లింది. నిధి వేట నేపథ్యంలో సాగే అడ్వెంచర్ ఫిల్మ్ కావడంతో అందుకు తగ్గట్లుగానే లొకేషన్లు కనుగొని ఆయా ప్రాంతాల్లో జక్కన్న చిత్రీకరణ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. రెండేళ్లలో షూటింగ్ కంప్లీట్ చేసి 2027లో సినిమాను రిలీజ్ చేయాలని దర్శనిర్మాతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓ డేట్ కూడా లాక్ చేశారట.
ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సమ్మర్ కానుకగా 2025 మార్చి 25న రాజమౌళి, మహేష్ బాబు మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుందని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2027 టార్గెట్ గా SSMB 29 సినిమాను పూర్తి చేసే పనిలో రాజమౌళి ఉన్నారట. ఒకవేళ రెండు పార్టులుగా తీస్తే.. సెకండ్ పార్ట్ ను 2028 చివర్లో లేదా 2029 ఆరంభంలో రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లానింగ్ చేస్తున్నారట.
కాగా, రాజమౌళి గత చిత్రం `ఆర్ఆర్ఆర్` కూడా 2022 మార్చి 25నే విడుదల అయింది. ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో.. ఎన్ని సరికొత్త రికార్డులను నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ కు కలగా మిగిలిపోయిన ఆస్కార్ ను కూడా తెచ్చి పెట్టిందీ చిత్రం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన ఆ లక్కీ డేట్ నే మహేష్ బాబు సినిమా విడుదలకు కూడా లాక్ చేశారని ప్రచారం జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.