"కంగనా" గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్ అంటూ ట్యాగ్ తెచ్చుకుని, సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూ ఉంటుంది. కంగనాను ఇష్టపడే వాళ్లు ఎంతమంది ఉన్నారో, అంతకంటే ఎక్కువగా ఆమె డైరెక్ట్‌గా మాట్లాడే మాటలు విని దూరంగా వెళ్లే వాళ్లు కూడా ఉంటారు. దేశంలో పెరుగుతున్న సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్)పై తాజాగా కంగనా స్పందించింది. సాధారణంగా ఇలాంటి విషయాలపై మాట్లాడితే నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యే వారు ఉంటారు. కెరీర్ డ్యామేజ్ అవుతుందనే భయం కూడా ఉంటుంది. కానీ కంగనా అలాంటిది కాదు – ఉన్నది ఉన్నట్లే పచ్చిగా, ఘాటుగా చెప్పేసింది.


లివ్-ఇన్ రిలేషన్ వల్ల కలిగే నష్టాలను కూడా స్పష్టంగా వివరించింది. ఈ మధ్య చాలా మంది లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ను ఫాలో అవుతున్నారు. కానీ ఇది మన సంప్రదాయం కాదు, మన సంస్కృతి కూడా కాదు. ఫారిన్ కల్చర్‌ని ఫాలో అవ్వడానికే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కంగనా మాట్లాడుతూ .. “సహజీవనంలో ఒక మహిళ గర్భం దాల్చితే ఎవరు ఆమెకు అబార్షన్ చేయిస్తారు? ఒకవేళ అబార్షన్ వద్దు అనుకుంటే ఆమెను జాగ్రత్తగా చూసుకునేది ఎవరు? అప్పటివరకు మధురమైన మాటలతో ఆకర్షించిన వ్యక్తి జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటాడా అన్న గ్యారంటీ ఉందా? కానీ పెళ్లి చేసుకుంటే ఒక బంధం ఉంటుంది, కుటుంబాలు కూడా వాళ్లకి తోడుగా ఉంటాయి. ఆ బంధానికి రక్షణగా తల్లిదండ్రులు, పిన్ని, బాబాయ్, అత్త, మామ – అందరూ ఉంటారు. అందుకే ఆ రిలేషన్‌షిప్ ఎప్పుడూ బలంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.



డేటింగ్ యాప్స్ గురించి కూడా ఘాటుగానే మాట్లాడింది. “తమపై తమకు నమ్మకం లేని వాళ్లు మాత్రమే డేటింగ్ యాప్స్ ఎక్కువగా వాడతారు. అమ్మాయిలు వీటిని వాడకపోవడం మంచిది. నా లాంటి వాళ్లు డేటింగ్ యాప్స్‌లో దొరకరు, అక్కడ ఎక్కువగా లూజర్లు మాత్రమే దొరుకుతారు. మనపై మనకు నమ్మకం ఉండాలి, మన బంధంపై అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ బంధం నిలుస్తుంది. డేటింగ్ యాప్ ద్వారా సరైన భాగస్వామి దొరుకుతాడని అనుకోవడం నాకు అర్థం కాదు” అని చెప్పింది. చాలామంది కంగనా మాటలకు స్పందిస్తూ .. “ఆమె చెప్పింది నూటికి నూరు శాతం నిజమే” అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: