
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మల్టీస్టారర్ చిత్రం “కూలీ” భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రజినీ - లోకేష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు నుంచే అపారమైన హైప్ ఏర్పడింది. అయితే సినిమా థియేటర్లలోకి వచ్చిన తరువాత మిశ్రమ స్పందన, కొన్ని చోట్ల నెగటివ్ టాక్ వినిపించింది. అయినా రజినీ స్టార్డమ్‌కు తగ్గట్టుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లు రాబడుతోంది. ప్రత్యేకంగా వీకెండ్ కలెక్షన్లు చూస్తే, ఇండియా నుంచి అమెరికా వరకు “కూలీ” వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నెగటివ్ టాక్ ఉన్నా ఫ్యాన్స్ హంగామా, మాస్ ఆడియెన్స్ రెస్పాన్స్ కారణంగా వసూళ్లు క్షణక్షణం పెరుగుతున్నాయి. తాజాగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ఈ సినిమా దాదాపు 5.9 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే 6 మిలియన్ డాలర్స్ మార్క్‌కు అతి చేరువలో ఉంది.
ఈ వసూళ్లతో రజినీకాంత్ “కూలీ”, విజయ్ నటించిన “లియో” సినిమాకు నార్త్ అమెరికాలో వచ్చిన లైఫ్‌టైమ్ కలెక్షన్లను కేవలం కొన్ని రోజుల్లోనే దాటేసింది. ఇది తమిళ సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. సరైన సినిమా పడితే రజనీ మ్యాజిక్ .. స్టామినా ఎలా ఉంటుందో మరోసారి కూలీ సినిమా చెప్పింది. ప్రస్తుతం నార్త్ అమెరికా మార్కెట్‌లో టాప్ 3 హైయెస్ట్ గ్రాసర్స్‌గా “జైలర్”, “పొన్నియిన్ సెల్వన్ 1” , అలాగే ఇప్పుడు “కూలీ” ఉన్నాయి. అయితే “కూలీ” ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందో అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. రజినీ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కొనసాగితే, ఇది మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం. మొత్తానికి, నెగటివ్ టాక్ ఉన్నప్పటికీ, రజినీకాంత్ మ్యాజిక్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద బాగా వర్కవుట్ అయ్యిందని చెప్పాల్సిందే.