
లోబో 2018 మే 21న ఒక టీవీ ఛానల్ తరఫున వీడియోని చిత్రీకరించడానికి తన టీమ్ తో కలసి భద్రకాళి చెరువు, వెయ్యి స్తంభాల గుడి వంటి ప్రాంతాలకి వెళ్లారు. అలా కారులో వరంగల్ నుంచి హైదరాబాద్ కి బయలుదేరారు. ఈ కారును కూడా లోబోనే డ్రైవ్ చేశారు. అలా ప్రయాణిస్తున్న సమయంలో రఘునాథపల్లి మండలం నిడికొండవ సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక ఆటోను బలంగా ఢీ కొట్టింది కారు. అయితే ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మేడే కుమార్, మణెమ్మలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరి కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
లోబో ప్రయాణిస్తున్న కారు కూడా ఒక్కసారిగా బోల్తా పడడంతో లోబోతో పాటు తన టీమ్ సభ్యులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు సైతం పోలీస్ కేస్ ఫైల్ చేయించగా.. రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అలా ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఈ కేసు విచారించి.. తాజాగా జనగామ కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. లోబో నిర్లక్ష్యంగానే వాహనాన్ని నడిపి ఇద్దరు మృతికి కారణమయ్యారని.. ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ.. అలాగే రూ .12,500 రూపాయలు జరిమానా విధిస్తూ జనగామ పల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ నరేష్ తెలియజేశారు.