సోషల్ మీడియా విస్తరణతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత, దాని వినియోగం వేగంగా పెరిగింది. అయితే, ఈ సాంకేతికతను కొందరు సరైన మార్గంలో కాకుండా, తప్పుడు పద్ధతుల్లో వినియోగించడం ప్రారంభించారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖ తారల పేర్లు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ క్లిప్స్ వంటి వాటిని అనుమతి లేకుండా మార్చి, మోర్ఫ్ చేసి లేదా కృత్రిమంగా సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఒక పెద్ద సమస్యగా మారింది.ఈ నేపథ్యంలో, ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ గౌరవం, వ్యక్తిగత హక్కులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, AI దుర్వినియోగంపై తీవ్రంగా స్పందించారు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.


సమాజంలో తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని, తన పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను అనుమతి లేకుండా ఎవ్వరూ వినియోగించరాదని స్పష్టంగా పేర్కొంటూ, చిరంజీవి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు, చిరంజీవి అభ్యర్థనను సమర్థిస్తూ ఆయనకు అనుకూలంగా కఠిన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఇకపై ఎవ్వరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్ లేదా ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించే ఇతర లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం లేదా ప్రచారార్థం ఉపయోగిస్తే, అది వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి కఠిన శిక్షలు విధించబడతాయి.



ఇటీవలి కాలంలో “మెగాస్టార్ - చిరు - అన్నయ్య” పేరుతో వివిధ డిజిటల్ వేదికలపై AI మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వాయిస్ క్లిప్స్, మోసపూరిత ప్రకటనలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు లేదా సంస్థలు టీఆర్పీ రేటింగ్స్ లేదా సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకోవడానికి చిరంజీవి వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అదేవిధంగా, కోర్టు ఆదేశాల ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు వ్యక్తిగతంగా అందజేసి, ఈ తీర్పు అమలు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది. అనుమతి లేకుండా చిరంజీవి ఫోటోలు, వీడియోలు లేదా వాయిస్ క్లిప్స్ సృష్టించి, ప్రచారం చేసే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.



చిరంజీవి తరఫున న్యాయవాదులు పేర్కొంటూ, “ఇది కేవలం ఒక వ్యక్తి హక్కుల పరిరక్షణ మాత్రమే కాదు, మొత్తం సినిమా రంగం గౌరవాన్ని కాపాడే ఉద్యమం. స్టార్ సెలబ్రిటీల వ్యక్తిగత ఇమేజ్‌ను తారుమారు చేసే ఈ రకమైన ఆఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టాలు మరింత కఠినంగా మారాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు. ఇకపైనా ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి చిరంజీవి పేరుతో నకిలీ వీడియోలు, ఫేక్ వాయిస్ ఓవర్స్, లేదా ప్రచార కంటెంట్ సృష్టిస్తే, వారికి కఠిన శిక్షలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది.ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైంది ఏమిటంటే — సాంకేతికత మన చేతిలో ఉన్న శక్తివంతమైన సాధనం, కానీ దానిని బాధ్యతాయుతంగా వినియోగించకపోతే, అది పెద్ద ప్రమాదంగా మారుతుంది. మెగాస్టార్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం, భవిష్యత్తులో AI దుర్వినియోగం చేసే వారందరికీ హెచ్చరికగా నిలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: