ఓవర్సీస్ మార్కెట్‌లో ‘ బాహుబలి: ది ఎపిక్ ’ ప్రీమియర్లు పూర్తయ్యాయి. మొదటి షో నుంచే ప్రేక్షకులు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులు, వీడియోలు, రివ్యూలు వైరల్ అవుతూ, ప్రపంచవ్యాప్తంగా మరోసారి బాహుబలి ఫీవర్‌ను తెచ్చాయి. ఇప్పటికే యూఎస్‌, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ వంటి దేశాల్లో అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్‌ షోలు నమోదవుతున్నాయి. ఇండియాలో కూడా ఇవాళ రాత్రి నుంచే షోలు స్టార్ట్ అవుతున్నాయి. రేపటి నుంచి పూర్తి స్థాయి సెన్సేషన్‌ మొదలవుతుందని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఎన్ఆర్ఐ ఆడియెన్స్‌ నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ చూస్తే, “ ఎన్ని సార్లు చూసినా ఇప్పుడీ ఎపిక్‌ కొత్త అనుభూతిని ఇచ్చింది ” అన్న వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రీ–మాస్టర్‌ చేయబడిన విజువల్స్‌, కొత్త బ్యాక్‌గ్రౌండ్‌ మిక్స్‌, రీ–కట్‌ చేసిన ఎడిటింగ్ ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తున్నాయని రివ్యూలు చెబుతున్నాయి.


ఓవర్సీస్‌ మాత్రమే కాదు, ఇండియాలో కూడా రీ–రిలీజ్‌ సినిమాల మధ్య ఈ సినిమా భారీ వసూళ్లు సాధించబోతుందని ట్రేడ్‌ టాక్‌. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ద్వారా దాదాపు రు. 10 కోట్లకు పైగా వసూలైనట్టు సమాచారం. ఏపీ, తెలంగాణలో వర్షాలు కొంతవరకు ప్రభావం చూపినా, ఇప్పుడు వాతావరణం క్రమంగా మెరుగుపడటంతో ప్రేక్షకులు థియేటర్ల వైపు తిరిగి వస్తున్నారు. వారాంతం కోసం వినోదం కావాలనుకునే కుటుంబాలు, యువత, పిల్లలు అందరూ బాహుబలినే మొదటి ఆప్షన్‌గా తీసుకుంటున్నారు.


రాజమౌళి ఈ రీ – రిలీజ్‌ను కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని .. ప‌నులు అన్నీ ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌ర్య‌వేక్షించారు. ఇంటర్వ్యూలు, మేకింగ్‌ వీడియోలు, స్పెషల్‌ ప్రోమోలు, సోషల్‌ మీడియా క్యాంపెయిన్ అన్నింటినీ రాజ‌మౌళి స్వయంగా గమనించారు. ప్రభాస్‌ ఇమేజ్‌ మళ్లీ బిగ్‌ స్క్రీన్‌ మీద మెరిసిపోగా, ఫ్యాన్స్‌ ఆ ఉత్సాహంతో థియేటర్లను పండుగలా మార్చేశారు. మొత్తానికి, ‘బాహుబలి: ది ఎపిక్’ మళ్లీ బాక్సాఫీస్‌పై దండయాత్ర మొదలుపెట్టింది. నిజంగానే రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్‌కి సరిలేరు మీకెవ్వరూ అనిపించే సమయం ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: