టాలీవుడ్‌లో మాస్ మ‌హారాజా అనే పేరును సంపాదించుకున్న రవితేజ ప్రస్తుతం కెరీర్‌లో ఒడిదుడుకుల్లో ఉన్నాడు. గత కొంతకాలంగా ఆయనకు సరైన హిట్‌ రాకపోయినా, చేతినిండా సినిమాలు ఉండటం మాత్రం ర‌వితేజ చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ‘ధమాకా’తో మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్‌ అయినా, ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆయన స్థాయికి తగ్గ విధంగా రాణించలేకపోయాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ఈగల్’ వంటి సినిమాలు రవితేజ ఇమేజ్‌కి సరిపోని డిజాస్ట‌ర్‌ ఫలితాలు ఇచ్చాయి. తాజాగా రవితేజ స్వయంగా ఇటీవ‌ల‌ నేను మిమ్మల్ని చాలా చిరాకు పెట్టాను అని చెప్పిన మాట ఆయనకు తన కెరీర్ ఎలా గాడి త‌ప్పింద‌ని ఒప్పుకున్నాడో స్వ‌యంగా చెపుతున్నాయి. రవితేజ ఫెయిల్యూర్స్ వెనుక ప్రధాన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలమైన కథలు లేకపోవడం, రొటీన్ స్క్రీన్‌ప్లే, మరియు ఆయన నమ్ముకున్న ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాటర్న్ ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వకపోవడం. అంతేకాదు, ఆయన స్టార్ దర్శకుల నుండి దూరమవడం కూడా ఒక ముఖ్య కారణంగా మారింది.


ఇటీవల రవితేజ చేసిన సినిమాలను పరిశీలిస్తే, వాటిలో చాలా వరకు కొత్త దర్శకులతోనే ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న ‘మాస్ జాతర’ సినిమాతో పాటు, కిషోర్ తిరుమల, శివ నిర్వాణ, కల్యాణ్ శంకర్, వశిష్ఠ వంటి యువ దర్శకులతో ఆయన ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. వీళ్లందరూ టాలెంటెడ్ అయినా.. కమర్షియల్ హిట్‌ ఉన్న స్టార్ డైరెక్టర్లు కాదనే విషయం వాస్తవం. కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మంచి విషయం అయినా మ‌ధ్య‌లో పెద్ద‌, స్టార్ ద‌ర్శ‌కుల‌తోనూ క‌లిసి ప‌ని చేయాలి.


ప్రస్తుతం స్టార్ దర్శకులు ఎక్కువగా టాప్ టియర్ హీరోలతోనే జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రవితేజ వంటి మిడ్ రేంజ్ హీరోలు వారికి దూర‌మ‌వుతున్నారు. మరోవైపు, రవితేజ కూడా స్టార్ డైరెక్టర్లను సంప్రదించడంలో ఆసక్తి చూపడం లేదు. కానీ ప్రేక్షకులు ఇప్పటికీ ఆయనను మాస్ హీరోగానే ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన మళ్లీ స్టార్ దర్శకులతో కలిసిపని చేస్తే, సినిమాలకు ప్రీ - రిలీజ్ బజ్ పెరుగుతుంది, కలెక్షన్లు కూడా కొత్త స్థాయికి చేరతాయి. మొత్తం మీద, రవితేజ దగ్గర ఇంకా ఛ‌రిష్మా , క్రేజ్ ఉంది. కానీ దానిని సరైన దిశలో వినియోగించుకోవాలి. మంచి స్క్రిప్ట్‌లతో పాటు స్టార్ దర్శకుల సపోర్ట్‌ కలిస్తే, ఆయన మళ్లీ బాక్సాఫీస్ వద్ద పాత జోష్‌ చూపించడం ఖాయం. ఇప్పుడు మాస్ మహారాజా ఆ దిశగా ఆలోచించే సమయం ఆసన్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: