- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన “ ఆంధ్ర కింగ్ తాలూకా ” ప్రస్తుతం థియేటర్లలో ర‌న్ అవుతోంది. క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌ ఉపేంద్ర పవర్‌ఫుల్ నటుడిగా కనిపిస్తుండగా, రామ్ అతని అభిమానిగా కీలక పాత్రలో మెరిశాడు. కథలో ప్రధానమైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే వ‌రుస‌గా ప్లాపులు వ‌చ్చిన ఓ స్టార్ హీరో ఆర్థికంగా చితికి పోతాడు. ఆ హీరో పేరు సూర్య (ఉపేంద్ర)కి వీరాభిమాని అయిన రామ్ రూ. 3 కోట్లు అందించడం. ఇదే సన్నివేశంపై కొంతమంది ప్రేక్షకుల నుండి “ ఇంత పెద్ద స్టార్ దగ్గర రూ. 3 కోట్లు కూడా లేకపోవడం ఎలా ? ” అనే లాజిక్ డౌట్స్ రావడం ప్రారంభమైంది.


ఈ ప్రశ్నలపై స్పందించిన దర్శకుడు మహేశ్ బాబు పి. వివరణ ఇచ్చారు. “ సూర్య మాట తప్పని వ్యక్తి. తన 100వ సినిమా తీసే ముందు వరుసగా తొమ్మిది ఫ్లాప్‌లు వచ్చాయి. ప్రతి సినిమా తో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భారీ నష్టాలు చవిచూశారు. ఆ నష్టాలన్నీ సూర్య తన సొంత డబ్బుతో భరించాడు. తన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే అది వ్యక్తిగతంగా తీర్చడం అతని గౌరవ ధర్మం ” అని వివరించారు. అలాగే, సినిమాలో ప్రతి అంశాన్ని విజువల్‌గా చూపించడం సాధ్యం కాదు అని దర్శకుడు అన్నారు. ఈ నేపథ్యాన్ని కథలోని సంఘటనల ద్వారా కాకుండా డైలాగుల ద్వారానే వివరించటంతో కొంతమంది ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారని అంగీకరించారు.


“ అప్పటి కాలంలో స్టార్ హీరోలు తమ డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను చూసుకునేవారు. ఒకటి రెండు సినిమాలు కాదు, తొమ్మిది వరుస ఫ్లాప్‌ల నష్టాలు తీర్చడం వల్ల సూర్య ఆర్థికంగా దెబ్బతిన్నాడు. ఆ సమయంలో రూ. 3 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం ” అని దర్శకుడు స్పష్టం చేశారు. కొన్ని కథా నిర్ణయాలు లాజిక్‌తో పోల్చితే భావాలకు దగ్గరగా ఉంటాయని, సూర్య పాత్రలోని పెద్ద మనసు, నిష్టను చూపించేందుకు ఆ సన్నివేశం తప్పనిసరి అయిందని తెలిపారు. అలాగే ప్రేక్షకుల అభిప్రాయం తనకు ఎంతో విలువైనదని, వారి దృష్టికోణాన్ని ఎప్పుడూ చిన్నచూపు చూడనని స్పష్టంచేశారు.


ఆ వివరణ వెలువడిన తర్వాత సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు కూడా ఆ సీక్వెన్స్‌ వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని పాజిటివ్ కామెంట్లు ఇస్తున్నారు. “ ఆంధ్ర కింగ్ తాలూకా ” కథలోని ఈ భావోద్వేగ కోణమే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: