
కథ :
ఔరంగజేబు కోహినూర్ వజ్రంతో పాటు భారతదేశాన్ని తన ఆధీనంలో పెట్టుకొని తమ మతంలోకి మారని వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అత్యంత క్రూరుడైన ఔరంగజేబు నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగలించాల్సిన బాధ్యతను వీరమల్లు (పవన్ కళ్యాణ్) కొన్ని కారణాల వల్ల తన భుజాలపై వేసుకుంటాడు. ఈ వజ్రాన్ని దొంగిలించడానికి వీరమల్లుకు ఎదురైనా సవాళ్లు ఏంటి? వీరమల్లు నిజంగా వజ్రం కోసమే ఔరంగజేబుతో పోరాటానికి సిద్దమయ్యాడా? వీరమల్లుకు ఈ బాధ్యతలు అప్పగించిన కుతుబ్ షా ఎవరు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపిస్తే చాలని సినిమా ఫలితంతో తమకు సంబంధం లేదని ఆలోచించే ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. ఎక్కువమంది అభిమానులు పవన్ స్టైల్, డైలాగ్ డెలివరీ చూడటానికి సినిమాకు వెళ్తారు. హరిహర వీరమల్లు సినిమా పవన్ అభిమానులు కోరుకున్న విధంగానే ఉంది. ఫాన్స్ కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అయితే సగటు సినీ అభిమానులను ఈ సినిమా పూర్తిస్థాయిలో మెప్పిస్తుందా అనే ప్రశ్నకు కొంతమేర కాదనే చెప్పాలి. ఫస్టాఫ్ వరకు హరిహర వీరమల్లు సినిమాపై పెద్దగా నెగిటివ్ ఫీలింగ్ లేకపోయినా సెకండాఫ్ మాత్రం అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేదు.
ఈ సినిమా స్టోరీ లైన్ నవ్యతతో ఉన్నా కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటె బాగుండేది. పంచమి పాత్రలో ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటించగా తన పాత్రకు ఆమె తన వంతు న్యాయం చేసారని చెప్పవచ్చు. ఇతర ప్రధాన పాత్రల నటీనటులు సైతం తమ యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ ఇద్దరూ ఈ సినిమా కోసం పని చేయగా ఇలా చేయడం వల్ల నచ్చని సన్నివేశాలను ఎవరు తెరకెక్కించారనే ప్రశ్న ప్రేక్షకుల మెదళ్లను తొలిచేస్తోంది.
కీరవాణి ఇచ్చిన పాటల్లో రెండు పాటలు ఆహా ఓహో అనేలా ఉండగా బీజీఎం విషయంలో సైతం ఆయన పాస్ మార్కులు వేయించుకున్నారు. అయితే రాజమౌళి సినిమాలకు క్వాలిటీ ఔట్ ఫుట్ ఇచ్చిన కీరవాణి ఇతర దర్శకుల సినిమాలకు ఇవ్వరని చాలామంది భావిస్తారు. మేకర్స్ కు చాలా సమయం ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొంతమేర జాగ్రత్తలు తీసుకుని ఉంటే రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని చెప్పవచ్చు.
మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ 2.30 గంటల నిడివితో ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్స్ మాత్రం న భూతొ న భవిష్యత్ అనేలా ఉన్నాయి.
కొన్ని ట్విస్టులు సినిమాను ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నిధి అగర్వాల్ పాత్రకు సంబంధింన ట్విస్ట్ బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నా మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా స్థాయి మరింత పెరిగేది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కారు. సనాతన ధర్మానికి సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ ఉండి ఉంటే వీరమల్లు సినిమా మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేసేది.
పవన్ ను అభిమానించే వాళ్ళు, కొత్తదనంతో ఉన్న సినిమాను చూడాలని భావించేవాళ్లు, పీరియాడిక్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను నిరభ్యంతరంగా చూడవచ్చు. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను సైతం ఈ సినిమా మెప్పిస్తుంది. కొన్ని చిన్నచిన్న తప్పులను మినహాయిస్తే మాత్రం హరిహర వీరమల్లు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పవచ్చు.
బలాలు : పవన్ నటన, ఫస్టాఫ్, కథ, యాక్షన్ సన్నివేశాలు, క్లైమాక్స్
బలహీనతలు : సెకండాఫ్, కొన్ని పాటలు, నిడివి, స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.75/5.0