అమెరికా అధ్యక్షుడిగా  వైట్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి బిడెన్ అన్ని లెక్కలు పూర్తి చేసి త్వరలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా  ఉన్నారు. జనవరి 20 తేదీన ఎంతో వైభవంగా జరగనున్న బిడెన్ ప్రమాణ స్వీకారానికి ఆత్మీయులు అందరూ తరలి రానున్నారు. అమెరికా ముందెప్పుడూ చూడనటువంటి అద్భుతమైన పరిపాలన చూస్తుంది, అందుకు నా టీమ్ సిద్దంగా ఉందని బిడెన్ ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. అయితే తాను ఏర్పాటు చేసుకున్న బృందంలో అత్యధికంగా భారతీయులకు చోటు కలిపిస్తూ వస్తున్న బిడెన్ తాజాగా మరో సారి భారతీయ మహిళకు కీలక పదవి అప్పగించారు.   


బిడెన్ ఏరి కోరి పదవి అప్పగించిన భారతీయురాలి పేరు సబ్రినా సింగ్. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ కు డిప్యూటీ  ప్రెస్ సెక్రెటరీ గా సబ్రినాను నియమించారు బిడెన్. ఎన్నికల సమయంలో సబ్రినా బిడెన్ , కమలా హరీస్ లకు అత్యంత కీలకమైన వ్యక్తిగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో ఆమె కీలక పాత్ర కూడా పోషించారు. బిడెన్, కమలా హరీస్ లకు మీడియా కార్యదర్శిగా పనిచేసిన ఆమె గతంలో అమెరికా డెమోక్రటిక్ నేషనల్ కమిటీ కమ్యునికేషన్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహించారు..అంతేకాదు.

మైక్ బ్లూమ్ బర్గ్ అధ్యక్ష్య ప్రచారంలో సీనియర్ ప్రతినిధిగా అలాగే బుకర్ అధ్యక్ష్య ప్రచారానికి నేషనల్ ప్రెస్ సెక్రెటరీ గా విధులు నిర్వహించారు. హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ప్రచారంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు ఇలా పలు కీలక బాధ్యతలు చేపట్టిన సబ్రినాను బిడెన్ నేరుగా వైట్ హౌస్ లో కమలా ప్రెస్ కార్యదర్శిగా నియమించడంతో భారత ఎన్నారైలు, ఎన్నారై సంస్థలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇదిలాఉంటే తనకు కీలక బాధ్యతలు అప్పగించినందుకు గాను సబ్రినా సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. వైట్ హౌస్ లో కమలా హరీస్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: