ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఇకపై భక్తులు ఆన్‌లైన్‌ బాటను అనుసరించాల్సిందేనా? ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం.. ఇకపై అలాంటి విధానాన్నే అనుసరిస్తారేమోనన్న అభిప్రాయాలు టీటీడీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. శ్రీవారి ఆలయంలో దర్శనాలకు సంబంధించి గత ఏడాదిన్నర కాలంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొవిడ్ కారణంగా గత ఏడాది మార్చి 20వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు దర్శనాలను 80 రోజుల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత కొవిడ్ ఆంక్షలను పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. ఈ క్రమంలోనే శ్రీవారి దర్శనానికి డిమాండ్ పెరగడంతో.. గతంలోలా భక్తులందరిని తిరుమలకు అనుమతించకుండా మార్పులు చేసింది. శ్రీవారి దర్శనానికి ముందుగానే ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్‌లో, సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌ లైన్‌లో జారీ చేసింది. అలిపిరి భద్రతా వలయం వద్ద భక్తులను తనీఖీ చేసే సమయంలో దర్శన టిక్కెట్లు, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు వర్చువల్ ఆర్జిత సేవలను ప్రవేశపెట్టిన టీటీడీ... ఈ సేవలకు సంబంధించిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తోంది. ఇక సిఫారస్సు లెటర్లపై జారీ చేసే వీఐపీ బ్రేకు దర్శనం టిక్కెట్లను తిరుమలలోనే జారీ చేస్తోంది టీటీడీ. ఇలా శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ మార్పులు తీసుకొచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా నియంత్రణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అటు తర్వాత భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సర్వదర్శనాని పునరుద్ధరించింది. మొదట ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు రోజుకు రెండు వేల చొప్పున టిక్కెట్లు జారీ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత 18వ తేదీ నుంచి రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు కేటాయిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు సర్వదర్శనం టోకెన్లు పొంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. అయితే టోకెన్లు జారీ కేంద్రం వద్ద నిత్యం తోపులాటలు చోటుచేసుకుంటుండటం, కొవిడ్ నిబంధనలు పాటించే పరిస్థితులు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలోనే సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్ లైన్లో భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. సర్వదర్శనానికి సంబంధించి ప్రతి నిత్యం 8వేల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 24వ తేదీన సర్వదర్శనం టోకెన్లను గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులకు ఆన్ లైన్‌లో కేటాయించింది. ఆన్‌లైన్‌లో భక్తులు సులభతరంగా టోకెన్లను పొందడంతో ఈ విధానం సక్సెస్ పుల్ అయ్యిందని భావించిన టీటీడీ.. రాబోయే రోజుల్లో కూడా శ్రీవారి దర్శన టిక్కెట్లు, టోకెన్లను ఆన్ లైన్‌లో కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: