కరోనా వైరస్... సరిగ్గా రెండేళ్ల క్రితం చైనాలో వెలుగు చూసిన మహమ్మారి... ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కూడా. తొలినాళ్లలో తగ్గినట్లే కనిపించిన వైరస్ మహమ్మారి.... ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్ రూపంలో సెకండ్ వేవ్ లక్షల మంది ప్రాణాలను హరించింది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ... వైరస్ భూతం మాత్రం... వదలటం లేదు. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్... థర్డ్ వేవ్ రూపంలో మరోసారి కలవరపెడుతోంది. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. అన్ని దేశాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. భారతదేశంలో కేసులు తగ్గినట్లే కనిపించినప్పటికీ... ఇప్పుడు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దాదాపు 222 రోజుల తర్వాత మహర్మారి ఉగ్రరూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒక్కరోజులేనే ఏకంగా లక్షన్నర కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య కూడా రెట్టింపుగా ఉంది. ఏడాది తర్వాత నాలుగు లక్షల మార్క్ దాటేసింది.

కొవిడ్ పాజిటివ్ కొత్త కేసుల నమోదులో మరోసారి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 24 గంటల్లోనే 42 వేల మందిని వైరస్ పాజిటివ్ బాధితులుగా గుర్తించారు అధికారులు. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు నిలిచాయి. ముంబై మహానగరంలో కొత్త కొవిడ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కొవిడ్ హాట్ స్పాట్‌‌గా ముంబైలోని పలు కేంద్రాలు మారిపోయాయి. ఆసియాలోని అతిపెద్ద స్లమ్ ఏరియాగా పేరున్న ధారావిలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నగరంలో అనేక ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించినట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రకటించారు. ఇక శానిటైజేషన్, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తృతం చేసినట్లు కూడా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది మరాఠా సర్కార్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక పగలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్, జిమ్, స్పా సెంటర్లు, బ్యూటీ సెలూన్లు, జూపార్కులు, మ్యూజియం, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులను మూసివేయాలని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: