ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. అన్ని సినిమా హాళ్లలో ఆన్ లైన్ ద్వారా టికెట్లు విక్రయించాలని... అది కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఎగ్జిబీటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం థియేటర్లలో సోదాలు నిర్వహించింది. చివరికి చేసేది లేక వందకు పైగా థియేటర్లు మూత పడ్డాయి కూడా. చివరికి సినిమా పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగారు. నిర్మాతలు, దర్శకులు కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. చివరికి వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ అయితే... ప్రభుత్వ విధానాన్ని బహిరంగంగానే తప్పుబట్టారు. సినిమా పరిశ్రమపై ప్రభుత్వ పెత్తనం ఏమిటని నిలదీశారు. పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. చివరికి స్వయంగా కలుద్దామని నాని ఆహ్వానం మేరకు వర్మ నేరుగా విజయవాడ చేరుకుని మంత్రితో భేటీ అయ్యారు.

మంత్రి పేర్ని - వర్మ మధ్య జరిగిన సమావేశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. సినిమా టికెట్ల తగ్గింపు విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ప్రభుత్వం నిర్ణయం వల్ల సినిమా కలెక్షన్లపై పెను ప్రభావం చూపుతుందని ఇప్పటికే సిని పరిశ్రమలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో వినోదం అందించాలనేది మాత్రమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని ఇప్పటికే మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఇక కొందరు వైసీపీ నేతలైతే... సినిమా పరిశ్రమ మొత్తం చంద్రబాబు చెప్పినట్లు ఆడుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో... టికెట్లపై ప్రభుత్వ నియంత్రణ, థియేటర్ల నిర్వహణ వంటి సమస్యలకు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఓ నాలుగు ఆప్షన్లను ప్రభుత్వానికి సూచించారు. పిశ్చర్ టైమ్ పేరుతో ఓ ట్రక్ ఏర్పాటు చేసి... అందులో సినిమాలు ప్రదర్శించాలన్నారు. ఇక రెండో ఆప్షన్ కింద కారవాన్ టాకీస్. మూవీ ఆన్ వీల్స్ అనేది కాన్సెప్ట్. ఇక మూడోది నోవా సినిమాస్. ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విధానంలో సినిమా థియేటర్లు ఏర్పాటు చేయడం.  అవసరమైతే వీటిని అద్దెకు ఇవ్వడం వల్ల అదనపు ఆదాయం కూడా వస్తుందన్నారు. ఇక చివరగా ఖాళీగా ఉన్న పెద్ద గోడౌన్లు, గదులను, గ్యారేజీలను కూడా థియేటర్లుగా మార్చుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ నాలుగో ఆప్షన్ సూచించారు వర్మ. వాటిని పరిశీలించాల్సిందిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగింట్లో ఏ ఒక్కదాని పట్లయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కొత్తదనాన్ని పరిచయం చేసినట్టవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

RGV