అవును! ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిలో ఈనాడు-సాక్షి రెండు ప్రధాన దినపత్రికలు ఒక్కటిగానే కనిపిస్తున్నాయట. వాస్తవానికి ఈనాడు.. అంటే.. బాబుకు రాజకీయంగా అధికారికంగా జవజీవాలు అందించిన ప్రధాన దినపత్రిక. ఈ పత్రిక అధినేత రామోజీ రావు.. చంద్రబాబును ఒంటిచేత్తో అధికారంలోకి తెచ్చి తెలుగు నాట సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా బాబుకు మద్దతిస్తూనే ముందుకు సాగారు. ఇక, సాక్షి పత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విపక్షం వైసీపీ అధినేత జగన్ కు చెందిన ఈ పత్రిక, చంద్రబాబును ఎంతగా భ్రష్టు పట్టించాలో అంతగా పట్టించడంలో ముందుండే పత్రిక. బాబు .. అమ్మ అన్నా.. దీనికి మరో పదాన్ని చేర్చి రాసే పత్రికగా పేరు పొందింది.

అలాంటి సాక్షితో ఈనాడు సమానమైపోయిందని అంటున్నారట బాబు!! ఆశ్చర్యంగా అనిపించినా ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈనాడుపై ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. గత కొన్నాళ్లుగా ఈనాడు పంథా మార్చుకుందని, ఏపీ విషయంలో ముఖ్యంగా తన(చంద్రబాబు) విషయంలోనూ ఈనాడు రాస్తున్న కథనాలు చాలా వ్యతిరేకంగా ఉంటున్నాయని బాబు ఆందోళన వ్యక్తం చేశారట. దీనికి కారణం.. రాష్ట్రాన్ని ఓ పక్క అభివృద్ధి దిశగా తాను ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తుంటే.. ఈనాడు రాసిన ఒకే ఒక్క కథనం ఈ మొత్తం వ్యవహారాన్ని మొదటికి తెచ్చిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారట.

తాజాగా ఈనాడులో ప్రచురితమైన వార్త బాబుకు ఆగ్రహం తెప్పించింది. ‘శతమానం భారతీ- తెలంగాణ ప్రగతి’ అనే శీర్షికతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ ఈనాడు ప్రత్యేకంగా ప్రచురించింది. అదే సమయంలో ఏపీకి 15వస్థానం దక్కిందని కూడా రాశారు. దీంతో బాబు ఈ కథనంపై మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు ప్రామాణికత ఏమిటని, ఇంకా సర్వే పూర్తికాకుండానే రిజల్ట్ ఇచ్చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక, ఈ కథనాలు పెట్టుబడి దారుల దృష్టికి వెళ్తే.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారని కూడా ఆయన ప్రశ్నించారట.

మరోపక్క, ఇటీవల వైసీపీ అధినేత జగన్‌తో రామోజీ భేటీ అయ్యారు. జగన్ కోరిన వెంటనే రామోజీ ఆయనకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇది కూడా బాబుకు నచ్చలేదు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం జగన్ ప్రయత్నిస్తుంటే.. ఆయనకు అనుకూలంగా ఈనాడు కథనాలు రాస్తుందేమో? ఆయన వ్యతిరేక వార్తలను తొక్కి పెడుతుందేమో? అని కూడా బాబు ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే బాబు.. రామోజీకి ప్రాధాన్యం తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఈనాడు చూసినా సాక్షి మాదిరిగా కనిపిస్తోందని బాబు చేసిన కామెంట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.