తిరుపతి తెలుగుదేశంపార్టీ నేతల్లో వణుకు ఎక్కువవుతోంది. ఏదో నిరసన తెలుపుదామనుకున్న నేతలు వ్యూహం కాస్త దాడిగా మారటంతో నేతల్లో ఇపుడు టెన్షన్ పెరిగిపోతోంది. టిడిపి నేతలను పోలీసులు వరుసపెట్టి విచారణ చేస్తున్నారు. నోటీసులిచ్చి మరీ విచారణ చేస్తున్నారు. పలువురిపై కేసులు కూడా పెట్టటంతో నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే ఈమధ్య కుటుంబంతో సహా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వామివారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన సంగతి గుర్తుంది కదా ? దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో ఉన్నపుడు అమిత్ షా కాన్వాయ్ పై హటాత్తుగా టిడిపి నేతలు దాడి చేశారు. ఇపుడా అంశమే సీరియస్ అయిపోయింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్రమోడి తర్వాత అత్యంత ప్రముఖుడెవరయ్యా అంటే అది అమిత్ షా అనే చెప్పాలి. అందుకే భద్రత దృష్ట్యా జడ్ ప్లస్ క్యాటగిరిలో ఉన్నారు. అటువంటి నేతపై అందునా టిడిపి వాళ్ళు దాడి చేస్తే బిజెపి ఊరుకుంటుందా ఇపుడదే జరుగుతోంది
దాడితో మొదలైన సమస్య

ఎప్పుడైతే అమిత్ షా కాన్వాయ్ పై టిడిపి స్ధానిక నేతలు దాడి చేశారో వెంటనే బిజెపి నేతలు చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఎదురుదాడి మొదలుపెట్టేశారు. అంతేకాకుండా కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. స్ధానిక నేతల దాడి వెనుక చంద్రబాబు ఉన్నారంటూ ఆరోపణలు విమర్శలతో బిజెపి నేతలు రెండు రోజుల పాటు రాష్ట్రాన్ని హోరెత్తించేశారు. దాంతో కేంద్రం కూడా సీరియస్ అయ్యింది. తిరుమల దాడి ఘటనను కేంద్ర హోం శాఖ సీరియస్ గా తీసుకుని జిల్లా పోలీసు అధికారులపై మండిపడింది. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని దాడిలో బాధ్యులను గుర్తించి వారిపై చర్లు తీసుకోవాలని గట్టిగా ఆదేశించింది. దాంతో పోలీసు అధికారులు కూడా ఘటనపై సీరియస్ గానే స్పందించారు. ఇపుడదే స్ధానిక టిడిపి నేతల్లో వణుకు పుట్టిస్తోంది.
వీడియో ఆధారాల సేకరణ

మొన్నటి 11 వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు వీడియో సాక్ష్యాధారాలతో నేతలను గుర్తించారు. దానికితోడు టివి చానళ్ళల్లో వచ్చిన వార్తలతో పాటు దినపత్రికలో వచ్చిన ఫొటోలనే సాక్ష్యాలుగా పోలీసులు తీసుకున్నారు. సాక్ష్యాధారాల ప్రకారం తిరుపతి అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్ గుణశేఖర్ నాయుడు జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు శ్రీధర వర్మ తిరుపతి ఎంఎల్ఏ సుగుణమ్మ అల్లుడు సంజయ్ తదితరులను గుర్తించటమే కాకుండా వారికి నోటీసులు కూడా ఇచ్చారు. పలువురిని ఇప్పటికే విచారణ కోసమని పోలీసు స్టేషన్ కు పిలిపించారు కూడా. కాన్వాయ్ పై దాడి చేసిన సుబ్రమణ్యం అనే కార్యకర్తను అదే రోజు అరెస్టు చేసి రిమాండ్ కు కూడా పంపిన విషయం తెలిసిందే. అధికారంలో ఉండి కూడా పోలీసులు కేసులు పెట్టటం రిమాండ్ కు తరలించటాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేకున్నారు.
ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది

ఏదో నిరసన తెలిపి అమిత్ షాకు తమ దెబ్బేంటో రుచి చూపిద్దామని అనుకున్న టిడిపి నేతలకు చివరికేదో అవుతోంది. తమతో పొత్తు విడిపోతే రాష్ట్రంలో బిజెపి పరిస్ధితేంటో తెలియచేద్దామని టిడిపి నేతలు అనుకున్నారు. కానీ స్వయంగా అమిత్ షా కాన్వాయ్ పైనే దాడి చేయటమంటే మాటలు కాదు. పార్టీ బలంగా ఉన్న ఉత్తరాధి రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు అమిత్ షా కాన్వాయ్ పై దాడికి ప్రయత్నించలేదు. అటువంటిది ఏపిలో మొన్నటి వరకూ మిత్రపక్షంగా ఉన్న టిడిపి నుండి ఊహించని స్ధాయిలో ప్రతిఘటన ఎదురువ్వటాన్ని బిజెపి తట్టుకోలేకుంది. అందునా ఏకంగా అమిత్ షా కాన్వాయ్ పైనే దాడి జరగటంతో ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా మండిపడటంతో విషయం చాలా సీరియస్ అయ్యింది. విచారణ తర్వాత విషయం ఎంతదాకా వెళుతుందో చూడాల్సిందే.