సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుండి నెల్లూరుకు వెళుతున్న హరికృష్ణ నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లికి సమీపంలోని చర్లపల్లి వద్ద కారుకు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున అతి వేగంగా వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది.
కామినేనిలో చికిత్స

ప్రమాదతీవ్రత ఎంత స్ధాయిలో ఉందంటే, ఎదురుగా వస్తున్న వాహనాన్ని హరికృష్ణ కారు ఢీ కొనగానే కారులో నుండి విసురుగా బయటపడిపోయారు. వేగంగా కారులోనుండి బయటపడటంతో నేరుగా రోడ్డును ఢీ కొన్నారు. దాంతో తీవ్ర గాయాలయ్యాయి. అసలే షుగర్ పేషంట్ కూడా అయిన హరికృష్ణకు ఇపుడు తీవ్ర గాయాలవ్వటంతో పరిస్ధితి సీరియస్ అయింది. హరికృష్ణతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురిలో ఇద్దరికి గాయలైనట్లు సమాచారం. అయితే ప్రమాదం జరగ్గానే దగ్గరలోనే ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు. తర్వాత కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో పాటు ముఖ్యమంత్రి, బావమరది చంద్రబాబునాయుడు, బాలకృష్ణతో పాటు తోబుట్టువులకు కూడా సమాచారం అందించారు.
అతివేగమే కారణమా ?

పరిస్దితి అయితే చాలా సీరియస్ గానే ఉంది. రెండు వాహనాలు బలంగా ఢీ కొనటంతోనే ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. ప్రమాదం జరిగినపుడు హరికృష్ణ సీటు బెల్టు కూడా పెట్టుకోలేదు. అందుకనే కారులో నుండి బటయకు వచ్చి పడిపోయారు. చంద్రబాబు, బాలకృష్ణ, కుమారులు, తోబుట్టువులందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆమధ్య పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ కూడా దాదాపు ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనే మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.