అసెంబ్లీలో ఎదురైన ఘోర పరాజయాన్ని మరిచిపోవడానికి జనసేన స్థానిక ఎన్నికలో సత్తా చాటాలని ప్రయత్నిస్తుంది. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల తరువాత జనసేన పోటీచేయబోయే రెండో ఎన్నికలు స్థానిక సంస్థలకు సంబంధించినవి. పవన్‌ కళ్యాణ్‌కు హీరోగా ఉన్న ఇమేజ్‌కు ఆయన పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని కొందరు విశ్లేషకులు అనుకున్నారు. కాని ఆయన కమ్యూనిస్టు పార్టీలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగారు.


ఏపీలోగాని, తెలంగాణలోగాని కమ్యూనిస్టు పార్టీలకు ఒంటరిగా ఎన్నికల్లో పోరాడే శక్తిసామర్థ్యాలు లేవు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే పవన్‌ ఇమేజ్‌ కారణంగా కొన్ని సీట్లయినా సాధించుకోవచ్చని ఆ పార్టీలు భావించాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బడుగు బలహీనవర్గాల ఓట్లు పడతాయని పవన్‌ భావించాడు. యూపీ వెళ్లి ప్రత్యేకంగా మాయావతిని కలిసి ఏపీలో ఉనికిలోనే లేని బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. చివరకు అన్ని పార్టీలూ దారుణంగా దెబ్బతిన్నాయి. ఇలా పవన్‌ చేసిన పొత్తుల ప్రయోగం విఫలమైంది. అందుకే స్థానిక సంస్థల్లో ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంలో భాగంగానే తాజాగా పొలిట్‌బ్యూరోను, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ప్రకటించినట్లుగా ఉంది. నలుగురితో పొలిట్‌బ్యూరోను, 12 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని పవన్‌ ప్రకటించాడు.


పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడనే వార్తలు వస్తున్నప్పుడల్లా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏదో ఒక పనిచేస్తున్నాడు. దీంతో ఆయన పార్టీపైనే పూర్తిగా దృష్టిపెట్టాడని, సినిమాల్లోకి వెళ్లడనే అభిప్రాయం కలుగుతోంది. ఈమధ్యనే సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తిరిగి సినిమాల్లో నటించాలని పవన్‌కు సలహా ఇచ్చారు. ఆ వార్త రాగానే ఈయన పొలిట్‌బ్యూరో, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ప్రకటించాడు. ఇక ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు అసెంబ్లీలోనూ, బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాని పవన్‌ ఏమీ మాట్లాడటంలేదు. ఏ పరిణామాలపై జనసేన స్పందన ఏమిటో తెలియడంలేదు. తాజాగా నాగబాబు 'వైఎస్సార్‌సీపీకి ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి మంచిగా పరిపాలించాలి' అని ఓ సలహా ఇచ్చాడు. టీడీపీయేమో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ఉతికి ఆరేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: