వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి అభివృద్ధిపై అందరిలో సందేహాలు నెలకొన్నాయి. అమరావతి అభివృద్ధిపై జగన్ కూడా ఎక్కడా పెద్దగా స్పందించలేదు. దీనికి తోడు.. కొన్ని రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి ముంపు ప్రాంతం..ఇక్కడ నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ.. రాజధాని గా అమరావతిని కొనసాగించే అంశం పరిశీలిస్తున్నాం అని కామెంట్ చేయడం వివాదానికి దారి తీసింది.


కానీ ఈ అంశంపై సీఎం జగన్ మాత్రం ఇంత వరకూ బాహాటంగా ఎక్కడా స్పందించలేదు. ఆయన మనసులో ఏముందన్నది బయటకు రాలేదు. కానీ దమ్మున్న పత్రికగా చెప్పునే ఓ పత్రిక తన ప్రత్యేక కథనంలో ఈ విషయంపై కొన్ని ఊహాగానాలు చేసింది. అవేంటో చూద్దాం..జగన్ బయటకు చెప్పకపోయినా ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారో కొంతమంది సన్నిహితులతో పంచుకున్నట్టు చెబుతున్నారట. వారు చెబుతున్న దాన్నిబట్టి అమరావతిని రాజధానిగా ఉంచుతారట. అయితే అది చంద్రబాబు కలలుగన్న రాజధానిలా ఉండదట. శాఖాధిపతుల కార్యాలయాలను జిల్లాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నారట !...


అంటే.. ఎలాగటంటే.. గనులశాఖ డైరెక్టర్‌ కార్యాలయాన్ని కడప జిల్లాలో, దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారట !.. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారని ఆ పత్రిక రాసుకొచ్చింది. సచివాలయం, శాసనసభ భవనాలు మాత్రం అమరావతిలోనే కొనసాగుతాయట !.. మొత్తంమీద అమరావతిని పరిపాలనా రాజధానిగా మాత్రమే పరిమితం చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఉందని చెబుతున్నారంటూ దమ్మున్న పత్రిక అంచనా వేస్తోంది.


అయితే.. జిల్లాలలో ఒకటీ అరా ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేస్తే అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలియదని ఆ పత్రిక వ్యాఖ్యానిస్తోంది. ఇలాంటి వితండ వాదనలు చేస్తున్నవారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్‌లో ఆస్తులు, ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నవారంతా కలిసి అమరావతిని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారన్న సందేహాలు కూడా రాష్ట్ర ప్రజలలో నెలకొంటున్నాయని కొత్త వాదన చేస్తోంది. ఎవరిమీదో కక్షతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను శిక్ష్షిస్తున్నారన్న భావన కూడా వేగంగా వ్యాపిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: