నిర్భయ కేసు నిందితుల రివ్యూ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఓవైపు ఉరితీసేందుకు రంగం సిద్ధమవుతోందని వార్తలువస్తున్న తరుణంలో... రివ్యూపిటిషన్‌పై విచారణ ఆసక్తిరేపుతోంది. మరోవైపు ఓ మహిళా షూటర్ కూడా నిందితుల్ని ఉరితీసే ఛాన్స్ తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు.
యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురు కామాంధులను ఉరి తీయడానికి ఏర్పాట్లు సాగుతున్న తరుణంలో.. ఆ అవకాశాన్ని తనకు కల్పించాలని మహిళా షూటర్ వర్తికా సింగ్ రక్తంతో లేఖ రాశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారిని మహిళల ద్వారా ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ మహిళ ఆ కిరాతకులను ఉరి తీయడం వల్ల సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చినట్టవుతుందని అన్నారు.
మహిళలను శక్తిహీనులుగా భావించడం వల్లే వారిపై యథేచ్ఛగా, ఇష్టానుసారంగా అత్యాచారాలు, దాడులు కొనసాగుతున్నాయని, వాటిని నిరోధించడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదని వర్తికాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. నిర్భయ దోషులను సోమవారం ఉరి తీసే అవకాశాలు ఉన్నాయంటూ అనధికారికంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనికోసం తీహార్ జైలు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారని, ఇద్దరు తలారులను ఢిల్లీకి పంపించాలని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు అధికారులకు ఆదేశాలను కూడా జారీ అయ్యాయి. నిర్భయ కేసులో దోషులుగా తేలిన పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
అయితే నిందితుడు అక్షయ్ కుమార్ సింగ్.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయడం, దానిపై 17వ తేదీన విచారణ నిర్వహించబోతుండటం.. ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డెతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్ ను విచారించనుంది. రివ్యూ పిటీషన్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువడిస్తుందనే అంశం చర్చనీయాంశమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి