ఎవరైనా కష్టాల నుండి దూరంగా పారిపోదామనో లేకపోతే కష్టాలను దూరంగా ఉంచుదామనో అనుకుంటారు. అదేంటో చంద్రబాబునాయుడు మాత్రం కోరి కష్టాలను కొనుక్కుంటున్నారు. తాజాగా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి) నివేదిక చదివిన ఓ ఐఏఎస్ అధికారిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా  మారింది. బిసిజి రిపోర్టును మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ కమీషనర్ విజయ్ కుమార్ చదివిన విషయం తెలిసిందే.

 

ఆ తర్వాత రిపోర్టుపై చంద్రబాబు కూడా మీడియా సమావేశం పెట్టి అమ్మ నా బూతులు తిట్టారు.  ప్రభుత్వాన్నో లేకపోతే రిపోర్టు తయారు చేసిన కన్సల్టెన్సీపై ఆరోపణలు చేస్తే సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిపోర్టును మీడియా సమావేశంలో చదివి వినిపించిన కమీషనర్ ను నోటికొచ్చినట్లు తిట్టటంలో చంద్రబాబు ఉద్దేశ్యమేమిటి ?

 

దళిత ఐఏఎస్ అధికారి అయిన విజయకుమార్ ను పట్టుకుని ’ విజయకుమార్ గాడు’ అంటూ చంద్రబాబు  సంబోధించాడు. ’వాళ్ళు రిపోర్టు ఇవ్వటమేంటి ? ఆ చెత్త రిపోర్టును విజయ్ కుమార్ గాడు చదవటం ఏమిటి’ ? అంటూ మండిపడ్డారు. నిజానికి ప్రభుత్వ అధికారిపై కామెంట్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏమి చేయమంటే అది చేయటమే అధికారుల బాధ్యత.

 

తాను సిఎంగా ఉన్నపుడు ఇంతకన్నా ఘోరంగా చంద్రబాబు అధికారులతో మాట్లాడించిన సంఘటనలున్నాయి. అయినా కానీ అప్పటి ప్రతిపక్ష నేతలెవరూ అధికారులపై మండిపడలేదు.  జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై అప్పటి డిజిపి ఠాకూర్ తో చంద్రబాబు ఎంత నీచంగా కామెంట్ చేయించింది అందరూ చూసిందే.

 

విజయకుమార్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఎస్సీ సంఘాలన్నీ ఫుల్లుగా ఫైర్ అవుతున్నాయి. ఉన్నతాధికారికి చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని హెచ్చరిస్తున్నారు పలువురు నేతలు. రాష్ట్రంలో ఎక్కడ అడుగుపెట్టినా ఆ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలు చంద్రబాబును అడ్డుకోవాలని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ చంద్రబాబు పర్యటనలో జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి ? మరి ఈ సమస్య నుండి చంద్రబాబు ఎలా బయటపడతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: