సరైన నడవడిక, కష్టపడే మనస్తత్వం, చిత్తశుద్ధితో పనిచేస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతోందని.. ఇందుకు అబ్దుల్ కలాం ఓ మంచి ఉదాహరణ అని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చేసే ప్రతిపనిలోనూ సామాజిక స్పృహ, సానుకూల దృక్పథం, జాతీయ భావాన్ని మనసులో నింపుకుని పనిచేయాలని యువత, విద్యార్థులకు ఆయన సూచించారు. హైదరాబాద్ లోని శాంతిసరోవర్ ఆడిటోరియంలో జరిగిన ‘కలాం కన్వెన్షన్-2020’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘కలలు కనండి, వాటి సాకారానికి కృషిచేయండని అబ్దుల్ కలాం ఇచ్చిన పిలుపులోని భావాన్ని మనం అర్థం చేసుకోవాలి.

కలలకు నూతన భాష్యం చెబుతూ, కలలు ఆలోచనలు వాస్తవ రూపం దాలుస్తాయని ఇందుకు కష్టించిపనిచేయాలని కలాం అదించిన స్ఫూర్తి దాయక సందేశాన్ని మరవొద్దు. తమ భవిష్యత్ గురించి ఆలోచించే వాళ్ళు గొప్పవాళ్ళు అయితే, దేశ భవిష్యత్ గురించి ఆలోచించే వారు మహనీయులుగా ఎదుగుతారు. భారతదేశ భవిష్యత్ గురించి కలలు కని, సాకారం దిశగా కృషి చేసిన ఆధునిక మహర్షి ఏపీజే అబ్దుల్ కలాం’ అని అన్నారు. చిన్నతనం నుంచే చిన్నారులు దేశభక్తిని, సామాజిక స్పృహను, కష్టపడి పనిచేసే తత్వాన్ని, క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి, పేదరికాన్ని జయించిన అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా తర్వాత దేశ రాష్ట్రపతిగా ఎదిగిన పరిణామక్రమాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు.

మదినిండా దేశభక్తి కలిగిన అబ్దుల్ కలాం.. స్వదేశీ సాంకేతికతనుపయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో అనంతరం అణుశక్తి ప్రయోగాల్లో భారతీయులు గర్వంగా తలెత్తుకునేలా చేశారన్నారు. కలాం ఎదుగుదల ఒక్కరోజులో జరిగింది కాదని కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, అహోరాత్రులు శ్రమించి దేశమే కాదు ప్రపంచమే గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగిన విషయాన్ని గుర్తు  చేశారు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షలను, సామాజిక అసమానతలను పారద్రోలడంలో యువత, విద్యార్థులు చొరవతీసుకోవాలన్నారు. మన సంస్కృతి, సంప్రదాయలను గౌరవిస్తూ, మన పెద్దలు అందించిన విలువలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు.  సర్వేజనా సుఖినోభవంతు అనే మన ప్రాచీన సూక్తిని దృష్టిలో ఉంచుకుని మనం చేసే పని ఏదైనా.. నలుగురికి ప్రయోజనాన్ని చేకూర్చే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఇష్టపడి, కష్టపడితే నష్టపడేది లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.


అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని  కలాం యువతలో చూశారని.. అందుకే భవ్యమైన భారత నిర్మాణానికి యువతను చైతన్య పరిచేందుకు అవకాశం ఉన్న ఏ సందర్భాన్ని ఆయన వదల్లేదన్నారు. కలాం పుస్తకాలను చదువుతూ తాను ఉద్వేగానికి గురైన సందర్భాలు అనేకమున్నాయని ఈ సందర్భంగా ఉపరాష్ర్లపతి పేర్కొన్నారు. తరగతి గదుల్లో, ఇంటి గోడలపై ఇలాంటి మహనీయుల సూక్తులు రాసుకోవడంతోనే సరిపోదని.. ఆ సూక్తుల్లోని భావాలను అర్థం చేసుకుని ఆచరించాలని చిన్నారులకు ఉపరాష్ర్ పతి సూచించారు. చిన్నతనం నుంచే మంచి పుస్తకాలను చదవడాన్ని అలవాటుచేసుకోవాలని.. దేశనాయకులు, కలాం వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను చదివి ప్రేరణ పొందాలని. వీటిని నిజ జీవితంలో అమలుచేయడం ద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చన్నారు. చదువును ఓ ఉద్యాగాన్నిచ్చే అవకాశంగా మాత్రమే చూడొద్దని।। చదువు అనేది వివేకం, విజ్ఞానం, స్వావలంబన, సాధికారతను పెంచేదిగా అర్థం చేసుకోవాలన్నారు.


ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో హింసకు తావు లేదని.. హింసను ప్రేరేపించే ఏ విషయానికీ మద్దతు ఇవ్వొద్దని ఆయన యువతకు సూచించారు. మతోన్మాదాన్ని ప్రోత్సహించే వారు సెక్యులరిజం అనే పదాన్ని అడ్డు పెట్టుకుని, ఇతరులపై దాడి చేస్తూ ఉంటారని.. అలాంటి ప్రయత్నాలను ఖండించాలన్నారు. తప్పుడు పనులు చేస్తున్నవారిని సమర్థించడం జాతివ్యతిరేక చర్య అవుతుందన్నారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే శాంతియుత వాతావరణం నెలకొనడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. 2050 నాటికి ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా అవతరించే దిశగా భారత్ ముందుకు సాగుతోందని.. ఈ పరిస్థితుల్లో ఇందుకు అనుగుణమైన నైపుణ్యాన్ని గుర్తించడం, ప్రోత్సహించడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడం, వినూత్న పరిష్కారాలు కనుగొనడం, సమస్యలకు సమాధానాలు కనిపెట్టే ప్రయత్నం చేయడం యువత లక్ష్యం కావాలన్నారు. 

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన పరంపరను మనం పరిరక్షించుకోవాలని.. దీని ద్వారా సాటి జీవుల పట్ల ప్రేమ, సమస్త విశ్వం పట్ల స్నేహభావం పరిఢవిల్లుతాయని చిన్నారులకు ఉపరాష్ర్దపతి మార్గదర్శనం చేశారు. కలాం చూపిన బాటలో నడుస్తూ.. వారు కలలుగన్న అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో చిత్తశుద్ధి, క్రమశిక్షణతో భాగస్వాములు కావాలన్నారు. స్వామి వివేకానంద చెప్పిన ‘లే, మేల్కో, గమ్యాన్ని చేరుకునేంతవరకు విశ్రమించకు’ అనే సూక్తిని గుండెలనిండా నింపుకుని భారత్ ను మరోసారి విశ్వగురు చేసే ప్రయత్నంలో ముందుకు నడవాలని ఉపరాష్ర్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ వ్యవస్థాపకుడు నరేశ్, ట్రస్టీ  పిడికిటి భూపాల్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డితోపాటు వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పాఠశాలలనుంచి వచ్చిన దాదాపు 2,400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: