ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. సోషల్‌ మీడియా నుంచి తప్పుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. వచ్చే ఆదివారం నుంచి ఆన్‌లైన్‌ నుంచి పూర్తిగా ఆఫ్‌లైన్‌ లైఫ్‌లోకి వెళ్తానేమోనని మోడీ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలోనే పోస్ట్ చేస్తానన్నారు. ఆయన పెట్టిన ఈ ఒక్క ట్వీట్‌కు... భారీ స్పందన వస్తోంది.

 

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోడీ... నెటిజన్లకు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చారు. వచ్చే ఆదివారం నుంచి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు దూరంగా ఉండే ఆలోచన ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతే... మోడీ సోషల్‌ మీడియా నుంచి తప్పుకోబోతున్నారంటూ... ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. 

 

మోడీ ఇప్పుడీ ఆలోచన ఎందుకు చేస్తున్నారో... ఎవరికీ తెలీడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయా? అని ఆయన ఫాలోవర్స్‌ చర్చించుకుంటున్నారు. ఏ సంగతీ మరో నాలుగైదు రోజుల్లో తేలిపోతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధాని ట్వీట్‌కు లక్షల సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వస్తుండగా... రీట్వీట్‌ చేస్తున్న వాళ్లు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు.

 

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ప్రపంచ స్థాయి నేతల్లో... ప్రధాని మోడీ కూడా ఒకరు. ట్విట్టర్‌లో ఆయనకు 5 కోట్ల 33 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీకి 4 కోట్ల 40 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అన్ని ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికల్లో 11 కోట్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న మోడీ... ఉన్నట్టుండి సోషల్‌ మీడియా నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నారనేది... ఆయన ఫాలోవర్స్‌తో పాటు... మిగతా వారికి కూడా అర్థం కాకుండా ఉంది. దేశంలోనే ఎవరికీ లేనంత పాపులారిటీ ఉన్న మోడీ... తాను సోషల్‌ మీడియా నుంచి తప్పుకున్నా... మిగతా వాళ్లు మాత్రం పోస్ట్‌ చేస్తూనే ఉండండి అంటూ... ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.

 

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే సోషల్ మీడియా ద్వారా ప్రజలకు బాగా చేరువయ్యారు... ప్రధాని మోడీ. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు దేశంలో సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ... అందర్నీ ఆకట్టుకుంటూ వచ్చారు. కానీ... కొన్ని కాంట్రవర్సీలపై మాత్రం ఆయన అటు మీడియా ముందుగానీ... ఇటు సోషల్‌ మీడియాలో గానీ ఎన్నడూ స్పందించలేదు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు దేశంలో వరుసగా జరిగిన దారుణ అత్యాచార ఘటనలపై మోడీ స్పందించలేదు. దీనిపై ఎందరు ఎన్నిరకాలుగా డిమాండ్లు చేసినా ఆయన నోరు మెదపలేదు. ఎక్కడా కనీసం స్పందించనూ లేదు. ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో మోడీ ప్రభుత్వానికి దేశం మొత్తం సపోర్ట్‌ చేసినా... caa విషయంలోనూ, ఢిల్లీ అల్లర్ల విషయంలోనూ చాలా మంది మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా... ఆ రెండు ఇష్యూలపై మోడీ ఇప్పటిదాకా స్పందించలేదు. కనీసం ట్విట్టర్లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌ బుక్‌లోనో తన సందేశాన్నీ ఇవ్వలేదు. పార్టీ కార్యక్రమాలపైనో, ప్రభుత్వ కార్యక్రమాలపైనో.. లేదా ఎవరికైనా శుభాకాంక్షలు, అభినందనలు చెప్పడానికో ఆయన ఇటీవల సోషల్‌ మీడియా ఎక్కువగా వాడుతున్నారు. అలాంటి వాటిపై యాక్టివ్‌గా ఉండే మోడీ... ప్రభుత్వానికి గానీ, తనకు గానీ వ్యతిరేకంగా జరిగే వాటిపై ఎందుకు ఎక్కడా స్పందించరనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: