ఇటువంటి ఓవర్ యాక్షన్ వల్లే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరింతగా గబ్బు పట్టిపోతారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ కు మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. స్దానిక సంస్ధల ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయటంతో మొదలైన వివాదం సుప్రింకోర్టు తీర్పుతో మరింత పెరిగిపోయింది. ఈ వివాదంలో నుండి నిమ్మగడ్డ ఎలా బయటపడతారా అని అందరు అనుకుంటుంటే కొందరు టిడిపి వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ తో కమీషనర్ మరింత గబ్బు పట్టిపోతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఎక్కడో తాడిచెట్లపాలెం అనే గ్రామంలో నిమ్మగడ్డ ఫొటోకు తెలుగుదేశంపార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. ఆ ఫొటోను పచ్చమీడియా ప్రముఖంగా ప్రచురించటం మరీ విచిత్రం. పాలాభిషేకాలు చేయించుకునేంతగా నిమ్మగడ్డ ఏమి చేశాడు ? ఏమి చేశాడంటే చంద్రబాబునాయుడు అండ్ కో డిమాండ్ చేసినట్లుగా ఎన్నికలను వాయిదా వేశాడు. మామూలుగా ఏ అధికారికైనా  అధికారంలో ఉన్నపార్టీకి అనుకూలంగా ఉంటాడనే ముద్ర పడుతుంది. కానీ రాజ్యాంగబద్దమైన ఎలక్షన్ కమీషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ మాత్రం చంద్రబాబు చెప్పినట్లే నడుకుంటున్నాడనే ఆరోపణలకు కేంద్రబిందువుగా మారాడు.

ఆయన వ్యవహారశైలి కూడా ఆరోపణలకు తావిచ్చింది లేండి. సుప్రింకోర్టు కూడా తన విచారణలో ఎన్నికల వాయిదాను ఏకపక్షంగా ఎలా నిర్ణయించారని చివాట్లు పెట్టటం లాంటి వాటితో  నిమ్మగడ్డ ఎవరి పక్షమో జనాలందరికీ అర్ధమైపోయింది. తాను నిష్పక్షపాతంగానే ఉన్నానని, విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పుకోవటానికి కమీషనర్ నానా అవస్తలు పడుతున్నారు. క్షేత్రస్ధాయిలో వ్యవహారాలు మాత్రం నిమ్మగడ్డ టిడిపి అధినేత చెప్పినట్లే నడుకుంటున్నారు అని అనుకునేట్లే ఉంది.

 

ఇటువంటి పరిస్ధితుల్లోనే కొందరు తెలుగుదేశంపార్టీకి చెందిన నేతలు ఓవర్ యాక్షన్ చేయటంతో నిమ్మగడ్డ ఆరోపణల్లో మరింతగా కూరుకుపోతున్నారు. నిమ్మగడ్డ మావాడే అనేట్లుంది టిడిపి నేతల చర్యలు. లేకపోతే ప్రభుత్వంతో వివాదాల్లో పీకల్లోతు కూరుకుపోయిన నిమ్మగడ్డ ఫొటోకు టిడిపి నేతలు పాలాభిషేకాలు చేయటమా ? సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇద్దామని అనుకుంటున్నారు ఎల్లో లీడర్లు ?

మరింత సమాచారం తెలుసుకోండి: