ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అంతర్గత రైలు ప్రయాణాలపై ఆంక్షలు తొలగించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్రంలో రైలు ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఏపీ ప్రభుత్వం రైలు ఆగే స్టేష‌న్ వ‌ర‌కు మాత్రమే ప్యాసింజ‌ర్లకు టికెట్లు జారీ చేయాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల స్టాపుల‌ను త‌గ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 
 
రాష్ట్రంలో రైలు ప్రయాణాలపై ఆంక్షలు తొలగించడం ప్రజలకు శుభవార్త అనే చెప్పవచ్చు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారి విషయంలో గందరగోళం నెలకొంది. సరిహద్దు జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కో విధానం అమలవుతూ ఉండటంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాల గురించి కీలక ప్రకటన వెలువడకపోవడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. 
 
కొన్ని చోట్ల ఈ పాస్ పరిశీలించి అనుమతులు ఇస్తుండగా... మరికొన్ని చోట్ల ఈ-పాస్‌తోపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పాస్ లేనివారిని రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. మరోవైపు నిబంధనల గురించి సరైన అవగాహన లేక ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా... రాష్ట్రం లోపల రైలు ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడం గమనార్హం. 
 
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా వాహనాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 82 మంది కరోనా భారీన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3200కు చేరింది. రాష్ట్రంలో 2209 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: