కరోనా వైరస్.. ఆరు నెలలుగా దేశంపై తీవ్ర ప్రభావం చూపిన ఈ మహమ్మారి ప్రభావం నిదానంగా తగ్గుతోంది. వైరస్ మరణాల సంఖ్య 1.51 శాతానికి తగ్గింది. మరోవైపు.. కొత్త కేసుల సంఖ్య కంటే రికవరీల రేటు పెరగటం శుభపరిణామం.

భారతదేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.51 శాతానికి దిగి వ‌చ్చింది. దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం ఈ క‌రోనా మరణాల రేటు మరింత త‌క్కువ‌గా.. అంటే.. ఒక శాతం కంటే త‌క్కువ‌గా ఉందని తెలిపింది ఐసీఎంఆర్. అదేవిధంగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా వ‌రుస‌గా రెండోరోజు 7.5 ల‌క్షల కంటే త‌క్కువ‌గానే ఉందని కూడా ప్రకటించింది. కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలు ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య త‌గ్గుతూ వస్తోంది.

ప్రస్తుతానికి దేశంలో లక్షా 19 వేలకు పైగా బాధితులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా అక్టోబర్ నెల మొదటి వారం వరకూ రోజుకు సుమారు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా తగ్గింది. ప్రతీ రోజు మూడు నుంచి నాలుగు వందల కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అంటే.. మరణాల సంఖ్య సగానికి పైగా తగ్గింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా రిక‌వ‌రీ రేటు కూడా 89 శాతం ద‌రిదాపుల్లోకి చేరింది. ఆ మొత్తం రిక‌వ‌రీల్లో 77 శాతం రిక‌వ‌రీలు కేవ‌లం 10 రాష్ట్రాలు, ‌కేంద్రపాలిత ప్రాంతాల నుంచే న‌మోద‌య్యాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశంలో 483 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కాగా.. అందులో 82 శాతం మ‌ర‌ణాలు 10 రాష్ట్రాలు, ‌కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయ్‌. మరోవైపు.. మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌కల నుంచి 29 శాతం మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. మొత్తానికి కరోనా ప్రభావం నానాటికీ తగ్గిపోవడం శుభపరిణామమనే చెప్పాలి. పైగా రికవరీ రేట్ పెరగడం ఊపిరిపీల్చుకోతగ్గ విషయమే.








మరింత సమాచారం తెలుసుకోండి: