భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం లవ్ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేసింది. దేశంలోనే తొలిసారిగా ఓ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన చట్టం ఇది. ఇస్లాం మతానికి చెందిన యువకులు హిందూ యువతులకు ప్రేమించి వివాహం చేసుకుని, వారిని ఇస్లాంలోకి మార్చడాన్ని లవ్ జిహాద్ కింద పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలుకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి 10ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ అనే కొత్త చట్టం రూపొందించారు.


ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో ఇక మీదట లవ్ జిహాద్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని, మోసం చేసి బలవంతంగా మతాంతర పెళ్లి చేసుకుని, ఆ తరువాత మతమార్పిడి చేసేందుకు
ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని శివరాజ్ సింగ్చౌహాన్ అన్నారు.


ఈ చట్టం గురించి రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. వివాహం ద్వారా మతమార్పిడులకు పాల్పడేవారికి ఈ చట్టం గట్టి గుణపాఠం నేర్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లవ్‌ జీహాద్‌కు పాల్పడే వారికి ఈ చట్టం ద్వారా గరిష్ఠంగా 10ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా లవ్ జిహాద్ కేసులో నిందితులను అరెస్టు చేసిన తరువాత 45 రోజుల వరకు బెయిల్ కూడా లభించకుండా ఈ చట్టాన్ని రూపొందించినట్లు వివరించారు.

 అంతేకాకుండా మతాంతర వివాహాలు చేసే మత గురువులకు 5ఏళ్ల జైలు, నిర్దిష్ట జరిమానా విధించేలా చర్యలుంటాయని, మత మార్పిడులను ప్రోత్సహించే సంస్థలను పూర్తిగా రద్దు చేసే అధికారం రాష్ట్ర సర్కార్‌కు ఉంటుందని హోం మంత్రి చెప్పారు. డిసెంబరు 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో ఈ చట్ట ఆమోదం కోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హోం మంత్రి నరోత్తం మిశ్రా వెల్లడించారు.
సరిగ్గా ఒక్కరోజు క్రితం యూపీ సర్కార్ కూడా లవ్‌జీహాద్‌కు వ్యతిరేకంగా ఓ ఆర్డినెన్సును ఆమోదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: