ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి  స్టేటస్ కో ఇచ్చేందుకు హై కోర్ట్ నిరాకరించింది. గత కొద్దికాలంగా ఈ ఎన్నికల నిర్వహణపై అధికార పక్షానికి, ఎస్ఈసీ కి వివాదం రాజుకుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామంటూ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రభుత్వానికి సమాచారమివ్వడం, కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం సమాధానమివ్వడం తెలిసిందే.


అంతకు ముందు స్థానిక ఎన్నికలను కరోనా కారణంగా చూపి ఎస్ఈసీ ఆరువారాలపాటు వాయిదా వేయడం తర్వాత జరిగిన పరిణామాలన్నీ వివాదాస్పదమైనవే. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని వ్యక్తిగతంగా నిందించడమే కాకుండా ఎన్నికలు వాయిదా వేయడాన్ని ముఖ్యమంత్రితో సహా మంత్రులు తీవ్రంగా తప్పు పట్టారు.
 అంతే కాదు, ఆదరాబాదరాగా పంచాయితీరాజ్ బిల్లులో సవరణ తెచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీ కాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది సర్కార్. ఆపై తమిళనాడునుంచి మాజీ న్యాయమూర్తి కనగ రాజ్ ను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించింది. ఈ చర్యలను ప్రజాస్వామికవాదులంతా తప్పు పట్టారు.


 స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు కి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించుకున్నారు. కోర్టు లో విచారణ తర్వాత నిమ్మగడ్డ కి అనుకూలంగా వచ్చిన తీర్పును సర్కార్ ఖాతరు చేయలేదు. సుప్రీం కోర్టులో తేల్చుకునేందుకు విఫల ప్రయత్నం చేసింది. అక్కడ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి అనుకూలంగా తీర్పు వెలువడింది. వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని బాధ్యతలు నెరవేర్చేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
మొత్తానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా మళ్ళీ నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విధులు నిర్వర్తించినందుకు అనువైన వాతావరణాన్ని కల్పించకుండా సర్కార్ వ్యవహరించింది. 



స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని కలసి ప్రతిపక్షాలు స్థానిక ఎన్నికలు వెంటనే తాజాగా నిర్వహించాలని, బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికల తేదీ ప్రకటించాలని విన్నవించుకున్నాయి. అయితే, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ ఉన్నంతవరకూ స్థానిక ఎన్నికలు జరిపేది లేదంటూ మంత్రులు బాహాటంగా చెప్తూ వచ్చారు. వచ్చే ఏడాది లో ఆయన రిటైర్ అయిపోయాక స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమంటూ సంకేతాలు పంపించారు. అయితే, ఎన్నికలు నిర్వహించలేనందుకు కరోనా ని సాకుగా చూపిస్తున్నారు. 


ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సమాచారం పంపగా చీఫ్ సెక్రటరీ కరోనా ఉందని ...ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలియచేసారు. 
పరిస్థితుల్ని అంచనా వేసేందుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించగా సిఎస్ ఆ విషయాన్ని పడనివ్వలేదు. దాంతో, గవర్నర్ ని కలసిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయాలను వివరించారు. సానుకూల స్పందన వస్తుందేమోనని ఎదురు చూసారు. తాజాగా స్థానిక ఎన్నికల విషయం హై కోర్ట్ కి చేరింది. ప్రభుత్వం ఈ ఎన్నికలపై స్టేటస్ కో ఇవ్వాల్సిందిగా కోరగా హై కోర్ట్ నిరాకరించింది. కేసు ను రేపటికి వాయిదా వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: