అరడజను పార్టీలు పోటీ పడినా.. ఎవరికీ మెజార్టీ మార్క్ సీట్లు రాలేదు. ఎక్స్‌ అఫిషియా సభ్యుల్ని కలుపుకున్నా సరిపోని పరిస్థితి. ఏ పార్టీ అయినా మరో పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఈ పరిస్థితుల మధ్య ఎవరు ఎవరితో కలుస్తారు?. ఎవరు ఎవరు ఎవరికి సహకరిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు నగర ఓటర్లు. టిఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 డివిజన్లలో గెలిచాయి. టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా ఆ పార్టీకి ఎక్కువమంది ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నా... మేయర్ పీఠం దక్కించడం కష్టమే.

ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే.. బీజేపీకి అవకాశం ఇచ్చినట్లే. టీఆర్ఎస్- బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ బీజేపీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఈ రెండు పార్టీలు ఎన్నికల తర్వాతైనా కలుస్తాయని ఆరోపించింది. ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలిస్తే... కాషాయ దళానికి అస్త్రం అప్పగించినట్లే. అందుకే మేయర్ పీఠం విషయంలో ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది.

మరో వైపు ఎంఐఎం కూడా రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేస్తోంది. తమకు తొందర పాటు ఏమీ లేదని.. పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు ఎంఐఎం అధినేత. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.
 
ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం.. ఏ రెండు పార్టీలు కలిసినా.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు కొత్త మలుపు తిరగనున్నాయి. ఎలాంటి పరిణామాలు ఏర్పడినా.. వాటినుంచి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకు వస్తుంది. ఎన్నికల్లో కనిపించిన ఉత్కంఠ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలోనూ కనిపించనుంది. మొత్తానికి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: