భార్యపై అనుమానం పెంచుకున్న భర్త వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని గొడవ పడుతూ ఉండేవాడు. ఇక ఇటీవలే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త భార్యపై అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. భార్య గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఎర్రగొండపాలెం మండలం లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజారావుకి మంగమ్మ తో వివాహమైంది. కొన్నాళ్లపాటు సజావుగా సాగిన వీరి సంసారంలో అనుమానం అనే పెనుభూతం దూరింది.
తన భార్య ప్రవర్తన లో మార్పు వచ్చినట్లు భావించిన రాజారావు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. మద్యం మత్తులో వచ్చిన రాజారావు భార్యతో గొడవ పడటం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడై భార్య గొంతు కోసి అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మంగమ్మ ప్రాణాలు విడిచింది ఇక ప్రస్తుతం రాజారావు చికిత్స తీసుకుంటున్నారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి